మైనింగ్ శాఖ కీలక నిర్ణయం.. ఖనిజాలపై పరిశోధనలకు నాలుగు ఐఐటీలు ఎంపిక..!

by Phanindra |   (  Updated:2025-08-03 18:01:12  IST  )

మైనింగ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఖనిజాలపై పరిశోధనలకు నాలుగు ఐఐటీలను ఎంపిక చేసింది.

మైనింగ్ శాఖ కీలక నిర్ణయం.. ఖనిజాలపై పరిశోధనలకు నాలుగు ఐఐటీలు ఎంపిక..!
X

దిశ, నేషనల్ బ్యూరో: క్లీన్ ఎనర్జీ, స్పేస్, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాలకు అవసరమైన కీలకమైన ముడిఖనిజాలపై పరిశోధనలు చేసేందుకు పలు విద్యాసంస్థలను నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు ఐఐటీలు సహా ఏడు విద్యాసంస్థలను నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ కింద సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈఈ)గా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

ఈ నిర్ణయానికి ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ అడ్వయిజరీ కమిటీ నుంచి ఆమోదం కూడా లభించినట్లు మైనింగ్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. కేంద్రం ప్రకటించిన విద్యాసంస్థల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ (ఐఎస్ఎం) ధన్‌బాద్, ఐఐటీ రూర్కీ ఉన్నాయి. మిగతా మూడు విద్యాసంస్థల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని కేంద్రం తెలిపింది.

ఈ సంస్థలు ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, రక్షణ, స్పేస్ రంగాలకు అవసరమైన కీలకమైన ఖనిజాలను గుర్తించడం, అవి ఎక్కడ దొరుకుతాయో వెతకడంతోపాటు ఇతర పరిశోధనలపై ఫోకస్ చేస్తాయి. ఇవి హబ్-అండ్-స్పోక్ మోడల్‌లో పనిచేస్తాయని కేంద్రం తెలిపింది.

అరుదైన ఖనిజాలు, లిథియం, కోబాల్ట్ వంటి కీలకమైన వనరుల విషయంలో దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను కేంద్రం ఆమోదించింది. 2024 నుంచి 2031 వరకు ఈ మిషన్ కొనసాగుతుందని ఈ ఏడాది జనవరిలోనే కేంద్ర కేబినెట్ తెలిపింది. ఈ మిషన్‌లో భాగంగానే తాజాగా సీవోఈలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Next Story