గ్యాస్ వినియోగదారులకు షాక్.. సిలిండర్ బుకింగ్‌పై కేంద్రం కొత్త పరిమితులు

by Gantepaka Srikanth |

దేశవ్యాప్తంగా గృహ అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల సరఫరాలో పారదర్శకతను పెంచేందుకు మరియు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

గ్యాస్ వినియోగదారులకు షాక్.. సిలిండర్ బుకింగ్‌పై కేంద్రం కొత్త పరిమితులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా గృహ అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల సరఫరాలో పారదర్శకతను పెంచేందుకు మరియు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత, తదుపరి సిలిండర్ బుక్ చేసుకోవడానికి మధ్య నిర్ణీత సమయం ఉండాలని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడవచ్చనే భయంతో వినియోగదారులు ముందస్తుగా బుకింగ్స్ (Panic Booking) చేస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం, గ్యాస్ సిలిండర్ల హోర్డింగ్ మరియు బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గతంలో 15 రోజులుగా ఉన్న రీఫిల్ బుకింగ్ విరామ సమయాన్ని (Lock-in Period) ఇప్పుడు 21 రోజుల నుండి 25 రోజులకు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

గృహ అవసరాలకే ప్రాధాన్యత..

సాధారణంగా 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునే వారు కూడా ఇప్పుడు కేవలం 15 రోజులకే బుకింగ్స్ చేస్తుండటంతో ఈ కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చారు. అలాగే డబుల్ సిలిండర్ కనెక్షన్ (DBC) ఉన్న వినియోగదారులు తమ రెండో సిలిండర్‌ను బుక్ చేసుకోవాలంటే కనీసం 30 రోజుల విరామం ఉండాలని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. కమర్షియల్ అవసరాల కంటే గృహ అవసరాలకే (Domestic Use) ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

కేంద్రం కీలక ఆదేశాలు జారీ..

దేశీయంగా గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అవసర వస్తువుల చట్టం-1955 కింద రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రొపేన్, బ్యూటేన్ వంటి వాయువులను ఇతర పెట్రోకెమికల్స్ తయారీకి వాడకుండా, కేవలం LPG ఉత్పత్తి కోసమే వినియోగించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో సుమారు 25 నుండి 30 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కావున అనవసరంగా ముందస్తు బుకింగ్‌లు చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని అధికారులు కోరుతున్నారు.

Next Story