మరో ఆరు నెలలు కాల్పుల విరమణే.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-03 05:44:34  IST  )

ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం విదితమే.

మరో ఆరు నెలలు కాల్పుల విరమణే.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. ఓ వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మావోయిస్టుల కాల్పుల విరమణ (Naxals Ceasefire) ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లుగా ఇటీవల ఓ బహిరంగ సభలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి కాల్పుల విరమణపై ఇవాళ మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ విడుదలైంది.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా..

ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేశారని జగన్ ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిందని తెలిపారు. ఈ క్రమంలో గత మే నెలలో మేము 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించామని పేర్కొన్నారు. అయితే, గడిచిన 6 నెలల కాలంలో అనుకున్న పద్ధతులను మా వైపు నుంచి అమలు జరిపి శాంతియుత వాతావరణం కొనసాగేలా వ్యవహరించామని తెలిపారు. ఇదే శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నామని లేఖలో వెల్లడించారు. గతంలో కొనసాగిన విధంగానే తమ వైపు నుంచి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామని. ప్రభుత్వం వైపు నుంచి కూడా గతంలో వ్యవహరించిన విధంగానే ఉండాలని కోరుతున్నామని పేర్కొన్నారు.

శాంతిని భంగం చేసేలా కేంద్రం ప్రయత్నాలు..

ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. అలాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాలు, సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఏక కంఠంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నామంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖలో ప్రస్తావించారు.

Next Story