Cease Fire Brek : మళ్లీ మొదటికొచ్చిన ఇరాన్- ఇజ్రాయెల్ వార్.. సీజ్ ఫైర్ బ్రేక్!

by Prasad Jukanti |   (  Updated:2025-06-24 09:43:53  IST  )

ఇరాన్ పై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Cease Fire Brek :  మళ్లీ మొదటికొచ్చిన ఇరాన్- ఇజ్రాయెల్ వార్..  సీజ్ ఫైర్ బ్రేక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత 12 రోజులుగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రపంచ దేశాలను టెన్షన్ పెట్టిస్తోంది. తాజాగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా దాన్ని ఇరాన్ (Iran) బ్రేక్ చేసిందని ఇజ్రాయెల్ (Israel) ఆరోపించింది. సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇరాన్ దాన్ని ఉల్లంఘించి తమపై క్షిపణులతో దాడులకు దిగిందని దీనికి ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలపై స్పందించిన ఇరాన్.. కాల్పుల విరమణను ఆమోదిస్తున్నామని శత్రువుపై మాకు అస్సలు నమ్మకం లేదని, మా వేళ్లు ఇప్పటికీ ట్రిగ్గర్ పైనే ఉన్నాయని హెచ్చరించింది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లబడుతాయని అంతా అనుకున్న సమయంలో మళ్లీ ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ (Cease Fire) బ్రేక్ కావడం, ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటం ప్రపంచ దేశాలను టెన్షన్ పెట్టిస్తోంది.

నాలుగు గంటలే బ్రేక్:

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ క్రెడిట్ తీసుకునే ప్రకటనలు చేశారు. ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ స్పందిస్తూ తాము ఇంకా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోలేదని చెప్పడం కొంత గందరగోళానికి దారితీసింది. ఆ తర్వాత సీజ్ ఫైర్ కు అంగీకరించినట్లు ఇరాన్ చెప్పడం, ఆ తర్వాత కాసేపటికి ఇజ్రాయెల్ సైతం ట్రంప్ ఒప్పందాన్ని అంగీకరించినట్లు వెల్లడించడంతో అంతా సెట్ రైట్ అయిపోయిందని భావించారు. ఓ నాలుగు గంటల పాటు ఇరు దేశాలు ప్రశాంతంగా ఉన్నాయి. యుద్ధం ముగిసిపోయిందని అంతా ఊపిరిపీల్చుకున్న సమయంలో అనూహ్యంగా ఇరాన్ నుంచి బాలిస్టిక్ క్షిపణులు రెండు తమ గగనతలంపైకి దూసుకువచ్చాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్ పై గట్టిగా స్పందించాలని తాను ఐడీఎఫ్ కు ఆదేశించానని కాట్జ్ పేర్కొన్నారు. టెహ్రాన్ కు అతి ముఖ్యమైన ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేయాలని సూచించాని చెప్పారు. అయితే కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇజ్రాయెల్ వైపు క్షిపణిని ప్రయోగించలేదని టెహ్రాన్ ఖండించిందని ఇరాన్ మీడియా తెలిపింది. మొత్తంగా తాజా పరిణామాలు ఇరు దేశాల మధ్య వార్ సిట్యుయేషన్ మరోసారి టెన్షన్ గా మారింది.

Next Story