రైల్వేశాఖ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా 74 వేల కోచ్‌లలో సీసీకెమెరాలు!

by Phanindra |   (  Updated:2025-07-13 15:59:52  IST  )

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైలు బోగీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది.

రైల్వేశాఖ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా 74 వేల కోచ్‌లలో సీసీకెమెరాలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా రైలు బోగీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమోదంతో 74 వేల రైలుబోగీల్లో డోర్స్ వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో రైళ్లలో భద్రత పెరుగుతుందని, దుండగులతోపాటు ఆర్గనైజ్డ్ గ్యాంగులను కూడా దాడులు చేయకుండా ఆపుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. నార్తర్న్ రైల్వేలో లోకో ఇంజిన్లు, కోచ్‌లలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీకెమెరాలు మంచి ఫలితాలు ఇవ్వడంతోనే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

శనివారం జరిగిన సమావేశంలో ఈ సీసీ కెమెరాల ప్రోగ్రెస్‌ను అశ్వినీ వైష్ణవ్, రైల్వే సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బుట్టి, ఇతర అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. అనంతరం దేశంలోని 74 వేల కోచ్‌లు, 15 వేల లోకోల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు వైష్ణవ్ పచ్చజెండా ఊపారు. ప్రతి రైలు కోచ్‌లో నాలుగు డోమ్ టైప్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని, ప్రతి లోకోమోటివ్‌లో ఆరు సీసీకెమెరాలు ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి.

వంద కిలోమీటర్ల వేగంతో రైలు వెళ్తున్నా, వెలుతురు సరిగా లేకపోయినా హైక్వాలిటీ ఫుటేజి ఉండేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఫుటేజీ పరిశీలించిందేకు ఇండియాఏఐ మిషన్ సహకారంతో ఏఐని కూడా ఉపయోగించుకోవాలని వైష్ణవ్ సూచించినట్లు అధికారులు వెల్లడించారు.

Next Story