త్రీ లాంగ్వేజ్ పాలసీపై పదో తరగతి విద్యార్థులకు ఊరట: CBSE కొత్త మార్గదర్శకాలు విడుదల

by Naga Rani Yarlagadda |

జాతీయ విద్యావిధానం ప్రకారం అన్ని పాఠశాలల్లో త్రీ లాంగ్వేజ్ పాలసీని ఎలా అమలు చేయాలో వివరిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేసింది.

త్రీ లాంగ్వేజ్ పాలసీపై పదో తరగతి విద్యార్థులకు ఊరట: CBSE కొత్త మార్గదర్శకాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ విద్యావిధానం (NEP-2020) ప్రకారం అన్ని పాఠశాలల్లో త్రీ లాంగ్వేజ్ పాలసీని ఎలా అమలు చేయాలో వివరిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులపై ఎలాంటి అదనపు భారం పడకుండా, భాషా అభ్యాసాన్ని మరింత అర్థవంతంగా మార్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని బోర్డు స్పష్టం చేసింది. అయితే.. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే త్రీ లాంగ్వేజ్ పాలసీ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2026-27 విద్యాసంవత్సరంలో ఈ నిబంధన నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒకసారి మాత్రమే వర్తించేలా ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులు రెండు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లు, ఒక భారతీయ లాంగ్వేజ్ చదవవచ్చని తెలిపింది.

ఇటీవలే జులై 1వ తేదీ నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు చదవాలని సీబీఎస్ఐ నిర్ణయించింది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా.. టెన్త్ విద్యార్థులకు మాత్రం దాని నుంచి మినహాయింపు ఇస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం 7 నుంచి 9 తరగతుల్లో ఉన్న స్టూడెంట్స్ 10వ తరగతికి వెళ్లినపుడు థర్డ్ లాంగ్వేజీ బోర్డు పరీక్షలు రాయనవసరం లేదని సీబీఎస్ఈ అకడమిక్స్ డైరెక్టర్ ప్రజ్ఞా ఎం.సింగ్ తెలిపారు. వీరికి కేవలం పాఠశాల స్థాయి ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రమే ఉంటుంది.

ఇదే విద్యాసంవత్సరంలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, ఆ తర్వాతి బ్యాచ్ ల వారికి రూల్స్ వేరుగా ఉండనున్నాయి. వీరు చదివే మూడు భాషల్లో రెండు భాషలు కచ్చితంగా భారతీయ భాషలు అయి ఉండాలి. వీరంతా 10వ తరగతికి వచ్చేసరికి థర్డ్ లాంగ్వేజీకి కూడా బోర్డు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం 22 అధికారిక భారతీయ భాషలకు సంబంధించిన ప్రత్యేక 6వ తరగతి లెసన్ బుక్స్ ను NCERT సిద్ధం చేస్తోంది. దివ్యాంగ విద్యార్థులకు (CwSN) 'దివ్యాంగుల హక్కుల చట్టం-2016' ప్రకారం మినహాయింపులు యథాతథంగా కొనసాగుతాయి. విదేశాల్లో ఉన్న సీబీఎస్‌ఈ పాఠశాలలకు, విదేశాల నుండి భారతదేశానికి తిరిగి వచ్చే విదేశీ విద్యార్థులకు మూడో భాషగా భారతీయ భాషను చదవాలనే నిబంధన నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.

Next Story