- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GST: జీఎస్టీకి తొమ్మిదేళ్లు
రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు తొలగిపోవడం, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం, పూర్తిగా డిజిటల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ వంటి సంస్కరణలతో పన్ను వ్యవస్థ మరింత పారదర్శకంగా మారింది.

దిశ, బిజినెస్ బ్యూరో: 'ఒకే దేశం-ఒకే పన్ను-ఒకే మార్కెట్' లక్ష్యంతో 2017 జూలై 1న అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. తొమ్మిదేళ్లలో దేశ పన్ను వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఉన్న పలు రకాల పన్నులు ఒకే విధానంలోకి రావడంతో వ్యాపారాలకు సౌలభ్యం పెరిగింది. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు తొలగిపోవడం, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం, పూర్తిగా డిజిటల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ వంటి సంస్కరణలతో పన్ను వ్యవస్థ మరింత పారదర్శకంగా మారింది. జీఎస్టీ ప్రారంభ సమయంలో 67.8 లక్షల నమోదిత పన్ను చెల్లింపుదారులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1.65 కోట్లకు చేరడం ఈ వ్యవస్థ విస్తరణకు నిదర్శనం. అదే సమయంలో నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.94 వేల కోట్ల స్థాయి నుంచి సగటున రూ.1.8 లక్షల కోట్లకు పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.22.27 లక్షల కోట్ల రికార్డు వసూళ్లు నమోదుకావడం కూడా జీఎస్టీ వ్యవస్థ బలోపేతానికి సంకేతం.
2025లో కూడా జీఎస్టీ రేట్లను మూడు శ్లాబ్‌లకు కుదించి, నిత్యావసర వస్తువులపై పన్నులు తగ్గించడం వల్ల వినియోగం మరింత పెరిగింది. ఆటోమొబైల్ రంగంలో పన్ను తగ్గింపులతో వాహనాల ధరలు తగ్గి అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్, సహజవాయువు, విద్యుత్, మద్యం వంటి కీలక ఉత్పత్తులు ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి రాలేదు. వీటిపై వచ్చే వ్యాట్ ఆదాయం కోల్పోతే తమ ఆర్థిక స్వాతంత్ర్యం దెబ్బతింటుందని రాష్ట్రాలు ఆందోళన చెందడమే దీనికి ప్రధాన కారణం. ఈ పెండింగ్ సమస్యలతో పాటు ఇన్వర్టెడ్ డ్యూటీ, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లోపాలు, వివాదాల పరిష్కారంపై వచ్చే జూలైలో జరగబోయే కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతో జీఎస్టీ భారత ఆర్థికవ్యవస్థను మరింత వ్యవస్థీకృతంగా మార్చడంలో విజయం సాధించినప్పటికీ, నిజమైన 'ఒకే మార్కెట్' లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోవాలంటే తదుపరి దశ సంస్కరణలు కీలకంగా మారనున్నాయి.






