- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనిల్ అంబానీపై సీబీఐ మరో కేసు.. రూ. 2,220 కోట్ల బ్యాంక్ మోసం!
బ్యాంక్ ఆఫ్ బరోడాను మోసం చేశారన్న ఆరోపణలపై అనిల్ అంబానీతో పాటు ఆయన సంస్థ 'రిలయన్స్ కమ్యూనికేషన్స్'పై సీబీఐ తాజాగా మరో కొత్త కేసు నమోదు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి కష్టాలు పెరుగుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాను (BoB) మోసం చేశారన్న ఆరోపణలపై అనిల్ అంబానీతో పాటు ఆయన సంస్థ 'రిలయన్స్ కమ్యూనికేషన్స్' (RCom) పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తాజాగా మరో కొత్త కేసు నమోదు చేసింది. సుమారు రూ. 2,220 కోట్లకు పైగా బ్యాంకుకు నష్టం కలిగించినట్లు సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుట్ర, మోసం, నేరపూరిత ప్రవర్తన వంటి అభియోగాలపై సీబీఐ ఈ చర్యలు చేపట్టింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ వివిధ అవసరాల కోసం బ్యాంకు నుంచి భారీగా రుణాలు పొందింది. అయితే, ఆ నిధులను అసలు ప్రయోజనాలకు వాడకుండా, అనుబంధ సంస్థల (Related Parties) ద్వారా నకిలీ లావాదేవీలు సృష్టించి దారి మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనివల్ల బ్యాంకుకు రూ. 2,220 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు.
అంబానీ నివాసంలో సోదాలు..
కేసు నమోదు చేసిన అనంతరం, సీబీఐ అధికారులు ముంబైలోని అనిల్ అంబానీ నివాసంతో పాటు రిలయన్స్ కార్యాలయాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రుణ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
బిగుస్తున్న ఉచ్చు
అనిల్ అంబానీపై ఇది రెండో కేసు కావడం గమనార్హం. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా కేసు కూడా తోడవడంతో అనిల్ అంబానీ చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.






