ఐజీతో పాటు ఏడుగురు పోలీసులకు జీవిత ఖైదు

by Ajay Maddhiboyina |

ఈ కేసులో జైదీ, అతని కొలీగ్స్ కలిసి తప్పుడు, ఫ్యాబ్రికేటెడ్ రిపోర్టును డీజీపీకి సమర్పించారని కూడా సీబీఐ కోర్టుకు తెలిపింది.

ఐజీతో పాటు ఏడుగురు పోలీసులకు జీవిత ఖైదు
X

- కస్టడీలో మృతి చెందిన రేప్, హత్య కేసు నిందితుడు

- నిజాన్ని ఒప్పించడానికి తీవ్రంగా వేధించిన పోలీసులు

- కస్టడీలో చనిపోయిన నిందితుడు

- మరో నిందితుడే హత్య చేశాడని తప్పుడు సాక్ష్యాలు

- హింసలకు తాళలేక చనిపోయాడని నిర్ధారణ

- పోలీసులనే దోషులుగా నిర్ధారించిన సీబీఐ కోర్టు

దిశ, నేషనల్ బ్యూరో:

హిమాచల్ ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 కోత్కాయ్ కస్టడీ మృతి కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ మైనర్ బాలిక రేప్, మర్డర్ కేసులో ఐదుగురి నిందితుల్లో ఒకరు పోలీస్ కస్టడీలో మృతి చెందాడు. పోలీసులు నిజం ఒప్పించడానికి పెట్టిన హింస తాళలేక మరణించాడని సీబీఐ కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో అప్పటి పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ జాహుర్ హైదర్ జైదీతో పాటు మరో ఏడుగురు పోలీసులను దోషులుగా సీబీఐ కోర్టు జడ్జి అల్కా మాలిక్ తేల్చారు. వీరిందరికీ జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు. హైదర్ జైదీతో పాటు డీఎస్పీ మనోజ్ జోషి, ఎస్ఐ రాజీందర్ సింగ్, ఏఎస్ఐ దీప్ చంద్ శర్మ, హెడ్ కానిస్టేబుల్స్ మోహన్ లాల్, సురత్ సింగ్, రఫీ మహ్మద్, కానిస్టేబుల్ రంజిత్ స్తేతాలకు జీవిత ఖైదును కోర్టు ఖరారు చేసింది. ఇదే కేసులో ఎస్పీ దందుబ్ వంగియాల్ నేగిని అంతకు ముందే నిర్దోషిగా విడిచిపెట్టింది. కాగా, 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జైదీ ప్రస్తుతం ఐజీ ర్యాంకులో ఉన్నారు.

కేసేంటి?

2017 జూలై 4న కోత్కాయ్ పట్టణంలో ఒక మైనర్ బాలిక స్కూల్ ముగిసిన తర్వాత తప్పిపోయింది. రెండు రోజుల తర్వాత సమీపంలోని అడవిలో ఆమె శవం లభించింది. పోస్టు మార్టమ్ రిపోర్టులో లైంగిక దాడి జరిపి దారుణంగా మత్య చేసినట్లు వెల్లడైంది. దీంతో 302, 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక రేప్ అండ్ మర్డర్ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం జైదీ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటు సూరజ్ సింగ్ అనే వ్యక్తితో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. కాగా, 2017 జూలై 13న సూరజ్ సింగ్ కస్టడీలో మృతి చెందాడు. కాగా, రాజీందర్ అనే మరో నిందితుడితో జరిగిన ఘర్షణలో సూరజ్ మృతి చెందినట్లు సిమ్లా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ రెండు కేసులను హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. 2017 జూలై 22న సీబీఐ జైదీ, డీసీపీ జోషితో పాటు మరో ఏడుగురు పోలీసులను అరెస్టు చేసింది.

సూరజ్ సింగ్‌ను నేరం ఒప్పుకోవాలని సిట్ పోలీసులు తీవ్రంగా హింసించారని, ఈ క్రమంలో విపరీతమైన దెబ్బలకు తాళలేక మృతి చెందినట్లు సీబీఐ గుర్తించింది. మెడికల్ బోర్డు కూడా మృతుడి శరీరంపై 20 కంటే ఎక్కువ దెబ్బలు ఉన్నాయని, పెద్ద లాఠీలు లేదా రాడ్లతో కొట్టినట్లు రిపోర్టు ఇచ్చింది. ఎయిమ్స్ కూడా మెడికల్ బోర్డు రిపోర్టును సమర్థించింది. అయితే 2018 నవంబర్‌లో కేసును హిమాచల్‌ప్రదేశ్‌లో కాకుండా వేరే రాష్ట్రంలోని కోర్టుకు బదిలీ చేయాలని నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో సీబీఐ కూడా ఈ కేసు ఇంకా తుది దశకు చేరుకోలేదని, ఇంకా ఎన్నో నిజాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని, త్వరిత గతిన విచారణ పూర్తి చేయడానికి ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని కోరింది. మాజీ ఐజీ అయిన జైదీ ఈ కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా సీబీఐ కోర్టుకు వెల్లడించింది.

కాగా, 2019 మేలో కస్టోడియల్ డెత్ కేసును చండీఘర్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చండీఘర్ కోర్టులో నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులు అనేక సాక్ష్యాధారాలను నాశనం చేశారని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో జైదీ, అతని కొలీగ్స్ కలిసి తప్పుడు, ఫ్యాబ్రికేటెడ్ రిపోర్టును డీజీపీకి సమర్పించారని కూడా సీబీఐ కోర్టుకు తెలిపింది.

Next Story