Cave: గుహలో రహస్య జీవితం.. రష్యన్ మహిళను చూసి పోలీసుల షాక్

by B.Srinivas |

గోకర్ణలోని రామతీర్థ కొండపైన ఓ ప్రమాదకరమైన గుహలో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలను గుర్తించారు.

Cave: గుహలో రహస్య జీవితం.. రష్యన్ మహిళను చూసి పోలీసుల షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న గోకర్ణలోని రామతీర్థ కొండపైన ఉన్న ఓ ప్రమాదకరమైన గుహలో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలను పోలీసులు గుర్తించారు. ఆ మహిళను 40 ఏళ్ల నినా కుటినా అలియాస్ మోహిగా గుర్తించారు. రామతీర్థ కొండ ప్రాంతంలో ఇటీవల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పర్యాటకుల భద్రత నిమిత్తం పోలీసులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తు్న్నారు. ఈ క్రమంలోనే ప్రమాదకరమైన, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఉన్న ఒక గుహ దగ్గర అనుమానాస్పదంగా కొన్ని వస్తువులు కనిపించాయి. దీంతో గుహ లోపలికి వెళ్లి చూడగా అక్కడ రష్యాకు చెందిన నినా కుటినా, ఆమె ఇద్దరు పిల్లలు ప్రేమ, అమాలను గుర్తించారు. వారిని చూసి పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సేఫ్ గా కొండకిందకు తీసుకొచ్చారు.

అనంతరం గోకర్ణ పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో ఆమె పాస్‌పోర్ట్, వీసా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 2017లో బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చిన మహిళ 2018 ఏప్రిల్ 19న గోవాకు వెళ్లింది. ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 8న ఇండియాకు తిరిగి వచ్చింది. వీసా గడువు ముగిసినప్పటికీ ఇండియాలోనే ఉంది. అయితే తాను భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత పట్ల చాలా ఆకర్షితుడయ్యానని, ధ్యానం కోసం ఇక్కడికి వచ్చానని ఆమె పోలీసులకు చెప్పినట్టు సమాచారం. వీసా ఉల్లంఘనను పరిగణనలోకి తీసుకుని, ఆ మహిళ, ఆమె కుమార్తెలను కార్వార్‌లోని మహిళా రిసెప్షన్ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి రష్యాకు తిరిగి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తు్న్నారు.

Next Story