పైసలే ప్రసాదం.. సిగరెట్ కాలుస్తూ ఆశీర్వాదం! వైరల్ అవుతున్న ఓ ఆలయ ఆచారం

by Ramesh Naini |

గుళ్లోకి వెళ్తే హుండీలో కానుకలు వేయడం మనకు తెలిసిన ఆనవాయితీ. కానీ, ఆ గుడికి వెళ్తే మీరు ఒక్క పైసా కూడా సమర్పించుకోనక్కర్లేదు.. పైగా వారే మీకు డబ్బులను ప్రసాదంగా ఇస్తారు.

పైసలే ప్రసాదం.. సిగరెట్ కాలుస్తూ ఆశీర్వాదం! వైరల్ అవుతున్న ఓ ఆలయ ఆచారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుళ్లోకి వెళ్తే హుండీలో కానుకలు వేయడం మనకు తెలిసిన ఆనవాయితీ. కానీ, ఆ గుడికి వెళ్తే మీరు ఒక్క పైసా కూడా సమర్పించుకోనక్కర్లేదు.. పైగా వారే మీకు డబ్బులను ప్రసాదంగా ఇస్తారు. అదీ మామూలుగా కాదు.. దేవుడి పూనకంతో ఉన్న వ్యక్తి పదునైన కత్తిపై నడుస్తూ, సిగరెట్ తాగుతూ ఈ ప్రసాదాన్ని పంచుతారు. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. తమిళనాడులోని ఓ ఆలయంలో జరిగే ఈ అరుదైన ఉత్సవానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.

ఆలయం ఎక్కడ ఉందంటే?

తమిళనాడు రాష్ట్రం, సేథియాతోప్పు సమీపంలోని వినాయకపురంలో ఉన్న శ్రీ వరం తరుం మాలిగైపరై కరుప్పస్వామి ఆలయంలో ఈ వినూత్న ఆచారం కొనసాగుతోంది. ఈ ఆలయంలో కొలువైన కరుప్పస్వామికి ప్రత్యేక ఉత్సవాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు అక్కడికి తరలివస్తారు.

ఆచారంలో ప్రత్యేకతలు ఇవే..

ఈ ఆలయంలో భక్తుల నుంచి ఎలాంటి విరాళాలు, కానుకలు స్వీకరించరు. దానికి బదులుగా దేవుడి ఆశీర్వాదంగా పవిత్రమైన (పైసలు) నాణేలను భక్తులకు చేతుల మీదుగా ప్రసాదంగా పంచుతారు. దీనిని స్థానికంగా ‘పిడి కాసు’ అని పిలుస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా దేవుడి వేషధారణలో (పూనకంతో) ఉన్న ఓ భక్తుడు పదునైన కత్తిపై నడుస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తారు. అదే సమయంలో ఆయన సిగరెట్ కాలుస్తూ ఈ నాణేలను భక్తులకు పంచుతారు. ఇలా దేవుడు స్వయంగా ఇచ్చినట్లుగా భావించే ఈ నాణేలను ప్రసాదంగా తీసుకుంటే.. సిరిసంపదలు వృద్ధి చెందుతాయని, దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

చాలా ఆలయాల్లో డబ్బులకే ప్రాధాన్యం..!

సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్న చాలా ఆలయాల్లో డబ్బులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఉన్న నేపథ్యంలో.. ఈ కరుప్పస్వామి ఆలయ సంప్రదాయం అందరినీ ఆకట్టుకుంటోంది. భక్తుల నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా, తిరిగి వారికే డబ్బులను ప్రసాదంగా ఇస్తూ భక్తి, సంప్రదాయాలకు పెద్దపీట వేయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘కమర్షియలైజేషన్ లేని నిజమైన ఆధ్యాత్మికత అంటే ఇదే’ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ ఆచారం నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Next Story