దయచేసి సహాయం చేయండి.. అసమర్థ పాలనపై కన్నీరు పెట్టుకున్న కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-15 01:25:16  IST  )

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12, 2025న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశంతో పాటు ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది.

దయచేసి సహాయం చేయండి.. అసమర్థ పాలనపై కన్నీరు పెట్టుకున్న కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12, 2025న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశంతో పాటు ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171, టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాల్లోనే బీజే మెడికల్ కాలేజీ (BJMC) వసతి గృహంలోని డాక్టర్ల హాస్టల్‌పై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 241 మంది ప్రయాణికులతో సహా 265-290 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం బీజే మెడికల్ కాలేజీలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థుల జీవితాలను, భవిష్యత్తును కబళించింది.

ఈ క్రమలో బీజే మెడికల్ కాలేజీలో కార్డియాక్ అనస్థీషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఒక సీనియర్ డాక్టర్ ఆవేదన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రొఫెసర్ హాస్టల్‌లో జరిగిన విధ్వంసం, విద్యార్థుల మరణాలతో కలత చెంది, ప్రభుత్వ అధికారుల సహాయం కోసం కన్నీళ్లతో వేడుకున్నారు. సోషల్ మీడియా పోస్టుల ప్రకారం.. ఈ ప్రొఫెసర్ గత నాలుగేళ్లుగా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌లో నివసిస్తున్నారు. కానీ ప్రమాదం తర్వాత వారిని హాస్టల్ ఖాళీ చేయమని ఆదేశించారు. ఈ సంఘటనను “మానవ గౌరవానికి జరిగిన అవమానం”గా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. “ఒక అర్హత గల కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ ప్రొఫెసర్‌ను అసమర్థ పాలన వల్ల కన్నీళ్లతో సహాయం కోసం వేడుకోవలసి వచ్చింది” అని పలు పోస్టులు ఆవేదన వ్యక్తం చేశాయి.

ఈ ప్రమాదం బీజే మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. 200 మందికి పైగా ఎంబీబీఎస్ విద్యార్థులు భయం, మానసిక ఒత్తిడి కారణంగా హాస్టల్‌ను ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత బీజే మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పరీక్షలను తాత్కాలికంగా రద్దు చేశారు. హాస్టల్ భవనాలు ధ్వంసమైనందున, విద్యార్థులను ప్రత్యామ్నాయ గృహాలకు తరలించారు. ఈ సంఘటనలో గాయపడిన 20 మంది విద్యార్థులలో 11 మంది ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే హాస్టల్ లో వంట చేసే వ్యక్తి, అతని మనవరాలి ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు.

ఈ ప్రమాదంపై దర్యాప్తు కోసం ప్రభుత్వం మూడు నెలల గడువు విధించింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఫ్లీట్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మరింత కఠినమైన సురక్షిత తనిఖీలను ఆదేశించింది. బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ను ఖాళీ చేయించి, దర్యాప్తు కోసం సిద్ధం చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఈ విషాదంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, గాయపడిన విద్యార్థులకు సహాయం కోసం టాటా గ్రూప్‌కు విజ్ఞప్తి చేసింది.

మరోవైపు సోషల్ మీడియాలో ఈ ప్రమాద ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. “భవిష్యత్తులో జీవితాలను కాపాడాల్సిన యువ వైద్యులు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం” అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ ప్రొఫెసర్ యొక్క ఆవేదనను ప్రస్తావిస్తూ.. అర్హత గల వైద్యులకు కూడా సమర్థవంతంగా సహాయం చేయలేని వ్యవస్థ ఉండటం మన సమాజానికి అవమానం అని పలువురు ట్వీట్ చేశారు.

ట్విట్టర్ లింక్

Next Story