Car blast video: ఢిల్లీ బ్లాస్ట్‌.. వెలుగులోకి మరో షాకింగ్ వీడియో

by Ramesh Naini |

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భయానక బాంబ్‌ పేలుడు కేసులో మరో షాకింగ్ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

Car blast video: ఢిల్లీ బ్లాస్ట్‌.. వెలుగులోకి మరో షాకింగ్ వీడియో
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భయానక బాంబ్‌ పేలుడు కేసులో మరో షాకింగ్ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్‌లో సాయంత్రం సుమారు 6.50 గంటల సమయంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో నిలిచివున్న i20 కారు అకస్మాత్తుగా పేలిపోతున్న దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి. ట్రాఫిక్‌ సిగ్నల్ వద్ద జరిగిన ఈ భారీ పేలుడు కారణంగా అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. పేలుడు ధాటికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. నిప్పు రవ్వలు, తీవ్రమైన పొగ వ్యాప్తి చెందింది. మరోవైపు ఏం జరిగిందో తెలియని ప్రజలు దిక్కుతోచని స్థితిలో పరుగులు తీస్తున్నట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తోంది.

కాగా, ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రస్తుతం లోతైన విచారణ చేపడుతోంది. ఈ పేలుడులో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను నిన్న ఉగ్రదాడిగా ప్రకటించింది. దర్యాప్తులో లభించిన ఆధారాల ప్రకారం, పేలుడు సమయంలో కారు నడిపిన వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీ అని గుర్తించారు. అతను డిసెంబర్ 6న బాబ్రీ మస్జిద్ కూల్చివేత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో దాడి జరపాలని ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసు బలగాలు అలర్ట్‌గా ఉన్నాయి. వీడియో ఇదే..

Next Story