ఐస్‌క్రీములతో క్యాన్సర్ ముప్పు.. తాజా అధ్యయనాల్లో కీలక విషయాలు వెల్లడి

by Yella Dhawani Reddy |

తియ్యగా, చల్లగా ఇట్టే కరిగిపోయే ఐస్ క్రీమ్‌లను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటుంటారు.

ఐస్‌క్రీములతో క్యాన్సర్ ముప్పు.. తాజా అధ్యయనాల్లో కీలక విషయాలు వెల్లడి
X

దిశ, వెబ్ డెస్క్: తియ్యగా, చల్లగా ఇట్టే కరిగిపోయే ఐస్ క్రీమ్‌లను (Ice cream) చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటుంటారు. ఎండకాలం (Summer) వచ్చిందంటే.. వేసవి నుంచి ఉపశమనం కోసం చాలా మంది రోజూ వివిధ రకాల ఐస్ క్రీములను లాగించేస్తుంటారు. అయితే, తాజా అధ్యయనంలో ఐస్ క్రీముల గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా ఐస్ క్రీములు ఫ్రీడ్జ్‌లోంచి తీసిన ఐదు నిమిషాలకే కరిగిపోతుంటాయి. కానీ, కొన్ని మాత్రం గంటల తరబడి కరగకుండా ఉంటాయి. దీనికి కారణం అటువంటి ఐస్‌ క్రీముల తయారీలో పాలీసోర్బేట్ 80 (Polysorbate 80) వంటి రసాయనాలను కలుపుతారు. ఇవి కేవలం ఐస్‌క్రీమ్‌లలోనే కాదు, అనేక ప్రాసెస్డ్ ఆహార (Processed food) పదార్థాలలో వాడే ఎమల్సిఫైయర్లు (Emulsifiers). ఈ రసాయనాలు ఆహార పదార్థాల స్థిరత్వాన్ని, ఆకృతిని కాపాడటంలో సహాయపడతాయి. వీటిని అధికంగా తీసుకోవటం ద్వారా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడించారు.

తాజా పరిశోధనల ప్రకారం ఈ ఎమల్సిఫైయర్లు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. అలాగే, జీర్ణవ్యవస్థలో వాపు (Inflammation)కు కారణమవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల క్రోన్స్ వ్యాధి, అల్సరేటివ్ కొలైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో పాటు చివరికి క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధుల ముప్పు కూడా పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు.. ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలలో వాడే కార్బాక్సీమీథైల్ సెల్యులోజ్, క్యారెజీనన్, మాల్టోడెక్స్ట్రిన్ వంటివి కూడా ఈ కోవకే చెందుతాయని పేర్కొన్నారు. అయితే ఎలుకలపై జరిపిన ప్రయోగాలలో ప్రతికూల ఫలితాలు వెలువడినప్పటికీ, మానవులపై వీటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం అని తెలిపారు.

Next Story