ఇండిగో విమానాల రద్దు.. రాజధాని ఢిల్లీకి రూ.వెయ్యి కోట్ల నష్టం

by Kema Shiva Kumar |

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ (Indigo Airlines) సంక్షోభం, విమానాల ఆకస్మిక రద్దుతో దేశ వ్యాప్తంగా పర్యాటక రంగం కుదేలైంది.

ఇండిగో విమానాల రద్దు.. రాజధాని ఢిల్లీకి రూ.వెయ్యి కోట్ల నష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో ఎయిర్‌లైన్స్‌ (Indigo Airlines) సంక్షోభం, విమానాల ఆకస్మిక రద్దుతో దేశ వ్యాప్తంగా పర్యాటక రంగం కుదేలైంది. జనం హాలిడేకు వచ్చే వింటర్ సీజన్‌లో జరిగిన ఫ్లైట్ల రద్దుతో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)కథనం మేరకు.. పలు రాష్ట్రాల్లో పర్యాటకుల సంఖ్య 60 శాతం వరకు పడిపోయినట్లుగా పేర్కొన్నారు. కేవలం ఢిల్లీ (Delhi)కి సుమారు రూ.1,000 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా తెలిపారు. రాజధానిలోని పలు మార్కెట్లలో కొనుగోళ్లు, జనసంచారం 25 శాతానికి పడిపోయిందని సీఐఐ నివేదికలో తేలింది. ఇక ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన వేలాది మంది పర్యాటకులు విమానాలు రద్దు కావడంతో ప్రయాణాలను వాయిదా వేసుకున్నారని వెల్లడించారు. హోటళ్లు, రిసార్ట్స్, టూర్ ఆపరేటర్లు బుకింగ్స్ భారీ స్థాయిలో రద్దు అయినట్లుగా తెలిపారు.

ఇక ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని సీఐఐ (CII) వెల్లడించింది. గౌహతి, ఇంఫాల్, డిబ్రూగఢ్, లెంగ్‌పుయి వంటి విమానాశ్రయాలకు ఇండిగో విమానాలు భారీగా రద్దు కావడంతో ఈ ప్రాంతాలకు పర్యాటకులు రాలేకపోతున్నారని తెలిపారు. పరిస్థితిని అధిగమించేందుకు రైల్వే శాఖ అత్యవసరంగా 37 ప్రీమియం రైళ్లకు 116 అదనపు కోచ్‌లు, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే ప్రత్యేక సర్వీసులను నడుపుతోందని అన్నారు. అయినా, విమాన టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు రాలేదని చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారని సీఐఐ పేర్కొంది. ఈ నష్టం కేవలం డిసెంబర్, జనవరి నెలకే పరిమితం కాకుండా మరికొన్ని నెలలు కొనసాగే ప్రమాదం ఉందని పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు.

Next Story