కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదం పెట్రేగిపోతోందని ఒప్పుకున్న ఇంటెలిజెన్స్ సర్వీస్

by Phanindra |

కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదం పెట్రేగిపోతోందని ఆ దేశ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఒప్పుకుంది. ఈ క్రమంలో భారత్ జోక్యం కూడా పెరిగిందని పార్లమెంటుకు తెలిపింది.

కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదం పెట్రేగిపోతోందని ఒప్పుకున్న ఇంటెలిజెన్స్ సర్వీస్
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం తీవ్రంగా పెరిగిపోయిందని, భారత్‌పై దాడులు చేయడానికి వాళ్లు కెనడాను ఉపయోగించుకుంటున్నారని ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంగీకరించింది. తాజాగా ఆ దేశ పార్లమెంటుకు కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) వార్షిక నివేదికను సమర్పించింది. దీనిలోనే ఖలిస్తానీ ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ప్రచారం చేయడానికి కెనడాను బేస్‌గా చేసుకొని నిధుల సేకరణ, భారత్‌లో దాడులకు పథక రచన జరుగుతోంది’ అని ఈ రిపోర్టు పేర్కొంది. 1980ల నుంచే హింసామార్గంలో పంజాబ్‌లో ప్రత్యేక సిక్కు దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కెనడా బేస్‌గా ఖలిస్తానీ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని సీఎస్ఐఎస్ తెలిపింది.

అదే రిపోర్టులో కెనడాపై భారత్ గూఢచర్యం చేస్తోందని సీఎస్ఐఎస్ ఆరోపించింది. భారత్‌తోపాటు చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్ కూడా కెనడాలో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఈ రిపోర్టు తెలిపింది. ‘కెనడాలోని కమ్యూనిటీలు, రాజకీయ నాయకులను ప్రభావితం చేయడానికి భారత అధికారులు, వారి ప్రాక్సీ ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారు. ఇవి బెదిరింపులు, మోసాలకు దారితీస్తే విదేశీ జోక్యం కిందనే పరిగణిస్తాం’ అని సీఎస్ఐఎస్ హెచ్చరించింది. అదే సమయంలో కెనడాలో పెరుగుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదం వల్ల ఈ దేశంలో భారత ప్రభుత్వ జోక్యం కూడా పెరుగుతోందని ఈ రిపోర్టు పేర్కొంది. కాగా, ఖలిస్తానీ టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, పాక్ బంధాలు బాగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ ప్రయత్నిస్తున్న సమయంలో సీఎస్ఐఎస్ రిపోర్టులో భారత్‌పై ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారింది.

Next Story