కార్మికుల తలలకు కెమెరాలు.. రోబోలకు ట్రైనింగ్? ఉద్యోగాలపై కొత్త ముప్పు!

by Ramesh Naini |   (  Updated:2026-04-13 14:39:17  IST  )

భారతదేశంలోని కొన్ని వస్త్ర తయారీ కర్మాగారాల్లో (గార్మెంట్స్) కార్మికులు తమ తలలకు కెమెరాలు అమర్చుకుని పనిచేస్తున్న వీడియోలు నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కార్మికుల తలలకు కెమెరాలు.. రోబోలకు ట్రైనింగ్? ఉద్యోగాలపై కొత్త ముప్పు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశంలోని కొన్ని వస్త్ర తయారీ కర్మాగారాల్లో (గార్మెంట్స్) కార్మికులు తమ తలలకు కెమెరాలు అమర్చుకుని పనిచేస్తున్న వీడియోలు నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఫుటేజీ ఆధారంగా కృత్రిమ మేధ (AI), రోబోలకు శిక్షణ ఇస్తున్నారనే ఊహాగానాలు ఇప్పుడు సర్వత్రా ఆటోమేషన్ భయాలను పెంచుతున్నాయి.

ఏఐకి శిక్షణ కోసమేనా?

వీడియోలలో కార్మికులు కుట్టుపని చేయడం, వస్త్రాలను కత్తిరించడం వంటి పనులు చేస్తుండగా, వారి తలలకున్న కెమెరాలు వాటిని ఫస్ట్-పర్సన్ (egocentric) కోణంలో రికార్డ్ చేస్తున్నాయి. ఖరీదైన మోషన్-క్యాప్చర్ టెక్నాలజీపై ఆధారపడకుండా, కార్మికుల చేతి కదలికలు, పనితీరును చూసి రోబోలు స్వయంగా నేర్చుకునేలా (ఇమిటేషన్ లెర్నింగ్) ఈ డేటాను ఉపయోగిస్తున్నారని పలువురు భావిస్తున్నారు. అంటే, భవిష్యత్తులో మనుషుల అవసరం లేకుండా యంత్రాలే ఈ పనులన్నీ సులభంగా చేయగలవు.

వెల్లువెత్తుతున్న ప్రశ్నలు

భవిష్యత్తులో తమ ఉద్యోగాలకే ఎసరు తెచ్చే సాంకేతికతను అభివృద్ధి చేయడానికి కార్మికులే (తెలియకుండా) సహాయం చేస్తున్నారా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రికార్డింగ్ దేనికోసమో కార్మికులకు స్పష్టంగా చెప్పారా? నిరాకరించే హక్కు వారికి ఉందా? డేటా సేకరణకు గానూ వారికి తగిన పరిహారం చెల్లిస్తున్నారా? తదితర నైతిక, కార్మిక హక్కుల ప్రశ్నలను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు లేవనెత్తుతున్నారు.

అమెజాన్ తరహాలోనే..

ఈ ఆటోమేషన్ ముప్పు కేవలం ఒక కర్మాగారానికో, దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే తన వేర్‌హౌస్‌లలో 10 లక్షలకు పైగా రోబోలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా, తన కార్యకలాపాల్లో 75 శాతాన్ని ఆటోమేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 2027 నాటికి 1,60,000 ఉద్యోగాలను నియామకం చేయాల్సిన అవసరాన్ని తప్పించుకోనుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కార్మికులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు భారీ గండి పడటం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story