BSF Jawan: 21 రోజుల తర్వాత భారత బీఎస్ఎఫ్ జవాన్‌ను అప్పగించిన పాక్

by S Gopi |

అప్పగింత శాంతియుతంగా పూర్తయిందని, రెండు దేశాల మధ్య సాధారణ ప్రోటోకాల్‌కు కట్టుబడి జరిగినట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు

BSF Jawan: 21 రోజుల తర్వాత భారత బీఎస్ఎఫ్ జవాన్‌ను అప్పగించిన పాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: గత నెల 23న పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్న మన దేశ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ అప్పగించింది. బుధవారం ఉదయం 10:30 గంటలకు అమృత్‌సర్ పంజాబ్‌లోని అట్టారి సరిహద్దు వద్ద మన సైన్యానికి అప్పగించినట్టు జాతీయ మీడియా కథనం పేర్కొంది. ఈ అప్పగింత సజావుగా, శాంతియుతంగా పూర్తయిందని, రెండు దేశాల మధ్య సాధారణ ప్రోటోకాల్‌కు కట్టుబడి జరిగినట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. జవాన్ పూరమ్ కుమార్ షా బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్‌కు చెందిన వ్యక్తి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 23న సరిహద్దు ప్రాంతంలో రైతులకు రక్షణ అందిస్తూ అస్వస్థతకు గురయ్యారు. విశ్రాంతి కోసం దగ్గరలోని చెట్టు వద్దకు వెళ్లారు. అయితే, అది పాకిస్తాన్ భూభాగం కావడంతో ఆ దేశ రేంజర్లు అతనిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన అధికారులు తక్షణం రెండు దేశాలకు చెందిన భద్రతా దళాల మధ్య చర్చలు చేపట్టారు. అయితే, మన అధికారుల విజ్ఞప్తులను పెడచెవిన పెట్టి పాకిస్తాన్ రేంజర్లు కొంతకాలంగా జవాన్ పూర్ణమ్‌ను అప్పగించడంతో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు. పాకిస్తాన్ రేంజర్స్‌తో క్రమం తప్పకుండా ఫ్లాగ్ సమావేశాలు, ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా బీఎస్ఎఫ్ నిరంతర ప్రయత్నాలను కొనసాగించింది. ఎట్టకేలకు 21 రోజుల తర్వాత పూర్ణమ్‌ను అప్పగించారని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.

Next Story