Gold Smuggle: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రూ.1.48 కోట్ల విలువైన బంగారం పట్టివేత

by S Gopi |

స్మగ్లర్ల ముఠా బంగాదేశ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తారని బీఎస్ఎఫ్ సిబ్బందికి పక్కా సమాచారం అందింది

Gold Smuggle: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రూ.1.48 కోట్ల విలువైన బంగారం పట్టివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారాన్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సిబ్బంది పట్టుకున్నారు. దాదాపు రూ. 1.50 కోట్ల విలువైన బంగారు కడ్డీలను బీఎస్ఎఫ్ 32వ బెటాలియ స్వాధీనం చేసుకోగా, ఓ భారతీయుడిని అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తి నుంచి రూ.1.48 కోట్ల విలువైన 1.745 కిలోల 10 బంగారు కడ్డీలు, విలువైన పసుపు రంగు లోహపు చిన్న ముక్కను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం నదియా జిల్లాలోని బాన్‌పూర్ గ్రామానికి చెందిన స్మగ్లర్ల ముఠా బంగాదేశ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తారని బీఎస్ఎఫ్ సిబ్బందికి పక్కా సమాచారం అందింది. దాని ఆధారంగా బీఎస్ఎఫ్ బృందం బాన్‌పూర్ సరిహద్దు ప్రాంతంలో ఆకర్స్మికంగా దాడి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నిఘా ఉంచిన బృందం బాన్‌పూర్‌లోని సరిహద్దు గ్రామం ఫుల్‌బరీ నుంచి అనుమానిత భారతీయ స్మగ్లర్‌ను గుర్తించారు. సదరు అనుమానితుడు భారత్-బంగ్లా సరిహద్దు వద్ద పొరుగు దేశం నుంచి ఫెన్సింగ్ పైనుంచి రెండు ప్యాకెట్లను అందుకోవడం గమనించిన బీఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్‌ను, స్వాధీనం చేసుకున్న బంగారంతో పాటు చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. స్మగ్లింగ్, అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు నిరంతరం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ డీఐజీ ఎన్‌కె పాండె పేర్కొన్నారు.

Next Story