బెంగళూరులో నడిరోడ్డుపై పట్టపగలే దోపిడీ.. దాడి చేసి రూ. 31 లక్షల నగదుతో ఎస్కేప్

by Ramesh Naini |

బెంగళూరులో భద్రతపై ఆందోళన కలిగించే ఒక ఘటన చోటుచేసుకుంది. బన్నెరఘట్ట రోడ్డు సమీపంలోని సకలవార వద్ద ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగిపై నలుగురు దుండగులు దాడి చేసి, రూ. 31 లక్షల నగదును దోచుకెళ్లారు.

బెంగళూరులో నడిరోడ్డుపై పట్టపగలే దోపిడీ.. దాడి చేసి రూ. 31 లక్షల నగదుతో ఎస్కేప్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులో భద్రతపై ఆందోళన కలిగించే ఒక ఘటన చోటుచేసుకుంది. బన్నెరఘట్ట రోడ్డు సమీపంలోని సకలవార వద్ద ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగిపై నలుగురు దుండగులు దాడి చేసి, రూ. 31 లక్షల నగదును దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైలాస్ (24) అనే ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి ఆదివారం సాయంత్రం 4:20 గంటల సమయంలో తన స్కూటర్‌పై రూ. 31 లక్షల నగదును తీసుకెళ్తున్నాడు. రెండు స్కూటర్లపై వెంబడించిన నలుగురు దుండగులు, సకలవార రోడ్డు వద్ద అతడిని చుట్టుముట్టారు. తప్పించుకునే అవకాశం లేకుండా అడ్డుకుని, ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.

రంగంలోకి పోలీసులు.. సీసీటీవీ దృశ్యాలు

దుండగులు కైలాస్‌ను మారణాయుధాలతో (మ్యాచెట్) బెదిరించి, తీవ్రంగా కొట్టారు. అనంతరం నగదు ఉన్న స్కూటర్‌ను తీసుకుని అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో బాధితుడి స్కూటర్ లభ్యమవ్వగా, అందులో ఉండాల్సిన రూ. 31 లక్షల నగదు మాయమైందని పోలీసులు తెలిపారు. ఈ దోపిడీ ఉదంతం మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో బన్నెరఘట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

ముందే ప్లాన్ చేశారా?

నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాధితుడు నగదు తీసుకెళ్తున్న విషయం ముందే తెలిసి దుండగులు ప్లాన్ చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జనసంచారం ఉండే ప్రాంతంలో, అది కూడా పట్టపగలే ఇలాంటి దోపిడీ జరగడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది.

Next Story