కేరళలో బ్రిటిష్ ఎఫ్-35బీ యుద్ధవిమానం అత్యవసర ల్యాండింగ్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-15 07:14:44  IST  )

కేరళలో బ్రిటీష్ ఫైటర్ జెట్ ఎఫ్-35బీ అత్యవసర ల్యాండింగ్ అయింది.

కేరళలో బ్రిటిష్ ఎఫ్-35బీ యుద్ధవిమానం అత్యవసర ల్యాండింగ్
X

దిశ, వెబ్ డెస్క్: కేరళలో (Kerala) బ్రిటీష్ ఫైటర్ జెట్ ఎఫ్-35బీ (British fighter jet F-35) అత్యవసరంగా ల్యాండ్ అయింది. శనివారం రాత్రి ఇంధనం అయిపోవటంతో తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency landing) చేశారు. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో విమానం ఎలాంటి అవాంతరాలు లేకుండా సురక్షితంగా దిగినట్టు అధికారులు తెలిపారు. ఈ విమానం ప్రస్తుతం తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిపివేసి ఉంది. మళ్లీ ప్రయాణించేందుకు అవసరమైన ఇంధనం నింపేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. భద్రతా కారణాల వల్ల విమానం ప్రయాణించిన దారి, మిషన్ లక్ష్యం వంటి వివరాలు గోప్యంగా ఉంచారు.

అయితే ఈ విమానం అరేబియా సముద్రంలో ఉన్న బ్రిటన్‌కు చెందిన విమాన వాహక నౌక HMS Prince of Wales నుంచి టేకాఫ్ అయినట్లు సమాచారం. ఈ మధ్యే భారత నేవీతో కలిసి సంయుక్త విన్యాసాల్లో ఈ ఫైటర్ జెట్ పాల్గొంది. ఇందులో భాగంగానే యుద్ధ విమాన వాహన నౌక అరేబియా సముద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఫైటర్ జెట్ గగనతలంలో ఉండగా, సముద్రం తీవ్రమైన అలలతో ఉన్న కారణంగా తిరిగి నౌకపై ల్యాండ్ అవ్వలేకపోయింది. ఇంతలో ఫైలట్ ఇంధనం తక్కువ ఉందని గుర్తించి, విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు భారత పౌర విమానాశ్రయం అనుమతి కోరాడు. అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన ప్రోటోకాల్ ప్రకారం విమానాశ్రయ అధికారులు వెంటనే పరిస్థితిని ప్రకటించి, విమానానికి సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం, భారత ప్రభుత్వ సంబంధిత శాఖలు, బ్రిటన్ రాయల్ నేవీ అధికారుల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. విమానం తనిఖీ అనంతరం అవసరమైన అనుమతులు లభించిన వెంటనే అది తిరిగి బయలుదేరే అవకాశం ఉంది.

Next Story