- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
260 కంపెనీలతో భారత్‌కు బ్రెజిల్ అధ్యక్షుడు.. ఢిల్లీలో బిజినెస్ మీట్!
260 కంపెనీలతో భారత్‌కు బ్రెజిల్ అధ్యక్షుడు వస్తున్నారు. ఢిల్లీలో బిజినెస్ మీట్ పెట్టి పలు ఒప్పందాలు చేసుకునే చాన్స్ ఉంది.

దిశ, నేషనల్ బ్యూరో: బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డ సిల్వా భారత పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏకంగా 260 కంపెనీలకు చెందిన డెలిగేషన్‌తో ఆయన ఈ నెల 19 నుంచి 21 వరకు మూడ్రోజుల పర్యటనకు వస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. భారత్‌కు వస్తున్న ఈ బృందం.. బ్రెజిల్ చరిత్రలో విదేశీ పర్యటనకు వెళ్తున్న అతిపెద్ద బృందం కావడం గమనార్హం. అంతేకాదు బ్రెజిల్‌లో ఎన్నికలకు ముందు అధ్యక్షుడు లూలా చివరి విదేశీ పర్యటన కూడా ఇదే. గతేడాది జులైలో బ్రెజిల్ వెళ్లిన ప్రధాని మోడీ.. లూలాతో పలు కీలక అంశాలపై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌లో లూలా పర్యటనకు బ్రెజిల్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రెసిడెంట్ లూలా ప్రిన్సిపల్ ఫారెన్ పాలసీ సలహాదారు సెల్సో అమోరిమ్ తెలిపారు.
వ్యూహాత్మక రంగాలు, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో సహకారానికి ఈ పర్యటనలో పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరిగే ఏఐ సమ్మిట్‌లో ప్రెసిడెంట్ లూలా పాల్గొంటారని, అదే సమయంలో విదేశాంగ శాఖ సహకారంతో భారీ బిజినెస్ సమావేశం ఏర్పాటు చేయనున్నామని బ్రెజిల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ హెడ్ జార్జ్ వియానా తెలిపారు. భారత్‌కు తాము చేసే ఎగుమతులను ఇతర రంగాలకు కూడా వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. 260 బ్రెజిల్ కంపెనీల ప్రతినిధులు ఢిల్లీలో జరిగే బిజినెస్ మీటింగ్‌లో పాల్గొంటారని స్పష్టంచేశారు.






