BR Gavai: మహరాష్ట్రలో ప్రోటోకాల్ ఇష్యూ.. సీజేఐ గవాయ్ సంచలన వ్యాఖ్యలు

by B.Srinivas |

న్యాయవ్యవస్థపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీజేఐ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

BR Gavai: మహరాష్ట్రలో ప్రోటోకాల్ ఇష్యూ.. సీజేఐ గవాయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: న్యాయవ్యవస్థపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీజేఐ బీఆర్ గవాయ్ (BR gawai) కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల వంటివని వ్యాఖ్యానించారు. ఈ మూడు వ్యవస్థలు ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి తన స్వస్థలమైన మహారాష్ట్ర (Maharashtra) ను సందర్శించారు. ఈ సందర్భంగా ముంబైలో మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో గవాయ్ ప్రసంగించారు. అయితే తను ముంబైకి రాగానే ప్రోటోకాల్ ప్రకారం స్టేట్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ముంబై పోలీస్ కమిషనర్ ఆయనను స్వీకరించడానికి రాలేదు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మహారాష్ట్ర సీనియర్ అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం పట్ల నేను నిరాశ చెందాను. ఒక రాజ్యాంగ సంస్థ అధిపతి మొదటిసారి రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు ఆయనతో వ్యవహరించే విధానాన్ని పునఃపరిశీలించాలి. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి సీజేఐ అయ్యాక మొదటి సారి రాష్ట్రానికి వచ్చినప్పుడు సీనియర్ ఆఫీసర్స్ అటెండ్ అవడం సముచితం కాదని భావిస్తే వారు దీని గురించి ఆలోచించాలి. ప్రోటోకాల్‌ కొత్త విషయం కాదు. కానీ ఇది ఒక రాజ్యాంగ సంస్థ మరొక సంస్థకు ఇచ్చే గౌరవానికి సంబంధించిన ప్రశ్న’ అని వ్యాఖ్యానించారు.

ప్రతి సంస్థ ఇతర సంస్థల పట్ల గౌరవం చూపాలన్నారు. మూడు వ్యవస్థలూ రాజ్యాంగం ప్రకారం పని చేయాలని తెలిపారు. రాజ్యాంగంలోని మూడు స్తంభాలు సమానమని నొక్కి చెప్పారు. దేశం బలంగా మారడమే గాక సామాజిక, ఆర్థిక రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని, అలాగే కొనసాగుతోందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం గవాయ్ ముంబైలోని చైత్యభూమి అయిన అంబేడ్కర్ స్మారకాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయితే అక్కడ సీనియర్ అధికారులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజాత సౌనిక్, డీజీపీ రష్మీ శుక్లా, ముంబై పోలీస్ కమిషనర్ దేవేన్ భారతిలు హాజరయ్యారు. సీజేఐ వ్యాఖ్యల గురించి తెలుసుకున్న వీరు కార్యక్రమానికి అటెండ్ అయినట్టు తెలుస్తోంది.

Next Story