- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కునో అడవుల్లోకి బోట్స్వానా చీతాల ఎంట్రీ.. భారత్‌లో సంఖ్య 57కు చేరిక!
ప్రతిష్టాత్మక ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా బోట్స్వానా నుంచి తీసుకొచ్చిన రెండు ఆడ చీతాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోమవారం కునో జాతీయ పార్కులోని ‘ఓపెన్ ఫారెస్ట్’ లోకి విడుదల చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత వన్యప్రాణి సంరక్షణలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రతిష్టాత్మక ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా బోట్స్వానా నుంచి తీసుకొచ్చిన రెండు ఆడ చీతాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోమవారం కునో జాతీయ పార్కులోని ‘ఓపెన్ ఫారెస్ట్’ (బహిరంగ అటవీ ప్రాంతం) లోకి విడుదల చేశారు. క్వారంటైన్, వాతావరణానికి అలవాటు పడే ప్రక్రియలు పూర్తి కావడంతో వీటిని అడవిలోకి వదిలిపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌కు వచ్చిన ఈ చీతాలను.. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇన్నాళ్లూ చిన్న ఎన్‌క్లోజర్లలోనే ఉంచారు. తాజాగా ఆ ప్రక్రియ పూర్తికావడంతో కునో నది సమీపంలోని అడవిలోకి వీటిని స్వేచ్ఛగా వదిలిపెట్టారు. చీతాలను విడుదల చేసిన అనంతరం సీఎం మోహన్ యాదవ్ జాతీయ పార్కులో పర్యటించారు. తాజా చర్యలతో ప్రాజెక్ట్ చీతాకు మరింత ఊతం లభించిందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
57కు చేరిన చీతాల సంఖ్య..
అంతర్జాతీయ ప్రాజెక్ట్ చీతా మూడో దశలో భాగంగా ఈ ఏడాది బోట్స్వానా నుంచి మొత్తం 9 చీతాలను (6 ఆడ, 3 మగ) కునోకు తీసుకొచ్చారు. వీటి రాకతో, మన దేశంలో పుట్టిన పిల్లలతో కలుపుకుని భారతదేశంలో మొత్తం చీతాల సంఖ్య 57కు చేరిందని అధికారులు వెల్లడించారు. బోట్స్వానా చీతాల రాకతో కునోలోని చీతాల జన్యుపరమైన వైవిధ్యం (Genetic Diversity) పెరుగుతుందని, ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యకరమైన, స్థిరమైన సంతానోత్పత్తికి దోహదం చేస్తుందని వన్యప్రాణి నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త చీతాలు కునో పర్యావరణ వ్యవస్థతో త్వరగానే మమేకమవుతాయని వారు భావిస్తున్నారు.
ప్రాజెక్ట్ చీతా ప్రస్థానం..
దేశంలో అంతరించిపోయిన చీతాల జనాభాను తిరిగి పెంచడం, అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తూ వేటాడేలా వాటిని సన్నద్ధం చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 2022 సెప్టెంబర్‌లో నమీబియా నుంచి 8 చీతాలను తీసుకురావడం ద్వారా భారత్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. 2023 రెండో దశలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను కునోకు తరలించారు.
భవిష్యత్ ప్రణాళికలు..
మధ్యప్రదేశ్ ప్రభుత్వం చీతా ప్రాజెక్టును కేవలం కునోకు మాత్రమే పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాలకు విస్తరించే పనుల్లో నిమగ్నమై ఉంది. గాంధీ సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని చీతాలకు రెండవ ఆవాసంగా అభివృద్ధి చేస్తున్నారు. నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యాన్ని మూడవ ప్రధాన కేంద్రంగా (చీతా ల్యాండ్‌స్కేప్) తీర్చిదిద్దుతున్నారు. క్వారంటైన్ ప్రక్రియలు పూర్తయిన తర్వాత మరికొన్ని చీతాలను ఈ కొత్త ఆవాసాలకు కూడా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.






