బోర్డర్ రాష్ట్రాల్లో సైరన్ మోత.. సరిహద్దు జిల్లాల్లో హైఅలర్ట్‌!

by Phanindra |

భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు యుద్ధం దిశగా వెళ్తున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

బోర్డర్ రాష్ట్రాల్లో సైరన్ మోత.. సరిహద్దు జిల్లాల్లో హైఅలర్ట్‌!
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత్, పాక్ మధ్య పరిస్థితులు మరింత వేడెక్కాయి. భారత్‌లోని 15 సైనిక స్థావరాలపై పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించగా.. వాటిని సైన్యం తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్, లడఖ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు హైఅలర్ట్‌లో ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో స్కూళ్లు మూసివేశారు. బ్లాకౌట్లు నిర్వహించడంతోపాటు వైద్య, పోలీసు శాఖల్లో సెలవులన్నీ రద్దు చేశారు.

జమ్మూకశ్మీర్‌:

జమ్మూకశ్మీర్‌ను పూర్తిగా యుద్ధవాతావరణం కమ్మేసింది. ముఖ్యంగా జమ్ము, రాజోరీ, ఉధంపూర్, సాంబ, శ్రీనగర్‌ తదితర ప్రాంతాలను బ్లాకౌట్ చీకట్లు కమ్ముకున్నాయి. పలుప్రాంతాల్లో పాకిస్తాన్ పంపిన మిసైల్స్‌ను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఆకాశంలోనే పేల్చేసింది. అఖ్‌నూర్, సాంబ, బారాముల్లా, కుప్వారాల్లో ఎయిర్ సైరెన్లు మోగుతున్నాయి. శ్రీనగర్ ఎయిర్‌పోర్టు హైఅలర్ట్‌లో ఉంది. ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను కూడా ఇక్కడ యాక్టివేట్ చేశారు.

పంజాబ్:

పంజాబ్ ప్రభుత్వం బోర్డర్‌కు దగ్గరగా ఉన్న జిల్లాల్లో కఠినమైన నిఘా, బ్లాకౌట్ అమలు చేస్తోంది. బోర్డర్‌కు దగ్గరగా ఉండే ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, అమృత్‌సర్, గుర్దాస్‌పూర్, తర్న్ తరణ్‌ జిల్లాల్లో స్కూళ్లన్నీ మూసివేశారు. గుర్దాస్‌పూర్‌లో 8 గంటలపాటు బ్లాకౌట్‌ అమలు చేస్తున్నారు. అలాగే, జలంధర్, హోషియార్‌పూర్‌ను పూర్తిగా బ్లాకౌట్‌లో పెట్టారు.

రాజస్థాన్:

పాక్ బోర్డర్‌కు సమీపంలో ఉన్న జైసల్మీర్‌ను అధికారులు పూర్తిగా బ్లాకౌట్‌లో ఉంచారు. ఇక్కడ సరిహద్దు వద్ద పాకిస్తాన్ దళాలు కాల్పులకు తెగబడుతున్నాయి కూడా. ఇక్కడి ఫలోడీ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఒక పాకిస్తాన్ డ్రోన్‌ను భారత దళాలు కూల్చివేశాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పోలీసు బలగాలను మోహరించారు. బోర్డర్‌కు దగ్గరగా ఉన్న ఐదు జిల్లాల్లో స్కూళ్లన్నింటినీ మూసేశారు.

హిమాచల్ ప్రదేశ్:

ఇక్కడ కూడా బ్లాకౌట్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దయింది. హమీర్‌పుర్, ఉనా, బిలాస్‌పుర్ జిల్లాల్లో భద్రతను భారీగా పెంచారు.

హరియాణా:

హరియాణాలో కూడా వైద్యరంగం, పోలీసు శాఖలో సెలవులన్నీ రద్దు చేశారు. అలాగే రాజకీయ కార్యక్రమాలు కూడా ఏవీ చేపట్టవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు అందాయి.

ఢిల్లీ:

ఢిల్లీ ప్రభుత్వం కూడా అన్ని సెలవులు రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం జరగదని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సన్నద్ధంగా ఉండాలని ఉద్యోగస్తులకు అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లు ఆదేశాలు జారీ చేశారు.

గుజరాత్:

పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకునే గుజరాత్‌లో కూడా అధికారులు హైఅలర్ట్‌లో ఉన్నారు. సముద్ర తీరంలో ఉండే గ్రామాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు..ఎలాంటి అనుమానాస్పద చర్యలు గమనించినా తమకు తెలియజేయాలని అక్కడి గ్రామస్థులు, సర్పంజ్‌లతో చెప్పారు.

పశ్చిమ బెంగాల్:

బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకునే పశ్చిమ బెంగాల్‌లో కూడా సెలవులన్నీ రద్దు చేశారు. ఇప్పటికే సెలవుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది.

బిహార్:

పోలీసులు, ప్రభుత్వోద్యోగులు, విపత్తు నిర్వహణ విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల సెలవులన్నీ బిహార్ ప్రభుత్వం రద్దు చేసింది. సరిహద్దు గ్రామాల్లో పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం నితీష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Next Story