- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సప్ చాటింగ్‌ల ఆధారంగా విడాకులివ్వలేం: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ముంబయి హైకోర్టు ఇటీవల ఒక విడాకుల కేసులో కీలక తీర్పునిచ్చింది. కేవలం వాట్సప్ సందేశాలను ప్రాతిపదికగా తీసుకుని విడాకులు మంజూరు చేయడం చెల్లదని స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కేవలం వాట్సప్ సంభాషణల (WhatsApp Chats) ఆధారంగా దంపతులకు విడాకులు మంజూరు చేయలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. క్రూరత్వం (Cruelty) కింద దాఖలైన పిటిషన్లలో సరైన సాక్ష్యాధారాలు లేకుండా, ప్రతివాదులకు తమ వాదనను వినిపించే అవకాశం ఇవ్వకుండా కేవలం చాటింగ్‌లను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. వివరాల్లోకి వెళితే.. నాసిక్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్య తనను మానసిక వేదనకు గురిచేస్తోందని, అసభ్యకర భాష వాడుతూ బెదిరింపులకు పాల్పడుతోందని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇందుకు ఆధారంగా వారిద్దరి మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్‌లను కోర్టుకు సమర్పించారు. దీనిపై విచారణ చేపట్టిన నాసిక్ ఫ్యామిలీ కోర్టు.. సదరు మహిళ తన భర్తను, అత్తమామలను వేధింపులకు గురిచేస్తోందని నిర్ధారించి, మే 2025లో భర్తకు అనుకూలంగా విడాకులు మంజూరు చేసింది.
హైకోర్టు ఏం చెప్పిందంటే?
ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ భారతీ డాంగ్రే, జస్టిస్ మంజుషా దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 27న కీలక ఆదేశాలు జారీ చేసింది. వాట్సప్ చాటింగ్‌లను కేవలం సాక్ష్యంగా చూపితే సరిపోదని, వాటిని చట్టబద్ధమైన సాక్ష్యాధారాలతో నిరూపించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. భర్త సమర్పించిన సందేశాలపై భార్యకు తన వివరణ ఇచ్చే లేదా వాటిని తిరస్కరించే అవకాశం ఇవ్వకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. సరైన విచారణ జరగకుండా కేవలం డిజిటల్ సందేశాల ఆధారంగా విడాకులు ఇవ్వడం చెల్లదని చెబుతూ, ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దు చేసింది. ‘వాట్సప్ చాటింగ్‌లను సరైన సాక్ష్యాధారాలతో నిరూపించనంత వరకు, కేవలం వాటి ఆధారంగానే విడాకులు మంజూరు చేయడం సాధ్యపడదు’ అని బాంబే హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
తిరిగి విచారణకు ఆదేశం..
హైకోర్టు ఈ కేసును తిరిగి నాసిక్ ఫ్యామిలీ కోర్టుకు పంపింది (Remand). భార్య తన వాదనలను వినిపించడానికి, సాక్ష్యాధారాలను సమర్పించడానికి పూర్తి అవకాశం కల్పించాలని ఆదేశించింది. అలాగే, దంపతులు ఇద్దరూ పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందేమో చూడాలని ధర్మాసనం సూచించింది.






