కోలీవుడ్‌లో బాంబు కలకలం.. హీరో రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బెదిరింపులు

by Malleboina Mahesh |

రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! డీజీపీ ఆఫీసుకి వచ్చిన ఫేక్ మెయిల్‌తో కలకలం. సోదాలు నిర్వహించిన బాంబ్ స్క్వాడ్.

కోలీవుడ్‌లో బాంబు కలకలం.. హీరో రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బెదిరింపులు
X

దిశ, వెబ్ డెస్క్: బాంబులు పెట్టామని గుర్తు తెలియని నిందితులు బెదిరించడంతో చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమిళనాడు రాష్ట్ర డీజీపీ (DGP) కార్యాలయానికి వచ్చిన ఒక అజ్ఞాత ఈమెయిల్ చెన్నై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసం, అలాగే అల్వార్‌పేటలోని నటుడు ధనుష్ ఇళ్లలో బాంబులు అమర్చినట్లు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా తమిళనాట భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ సమాచారం అందిన వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు బాంబు స్క్వాడ్ (Bomb Squad), డాగ్ స్క్వాడ్‌తో కలిసి రజనీకాంత్, ధనుష్ నివాసాలకు చేరుకున్నారు. సుమారు గంటన్నర పాటు ఇళ్లలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. అయితే, ఎక్కడా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అది కేవలం ఒక "ఫేక్ కాల్" అని ప్రాథమికంగా నిర్ధారించారు.

నిందితుడి కోసం వేట..

ప్రముఖ నటుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా విజయ్, అజిత్, సూర్య వంటి నటుల ఇళ్లకు ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. డీజీపీ కార్యాలయానికి మెయిల్ పంపిన వ్యక్తి ఎవరు? ఏ ఐపీ (IP) అడ్రస్ నుంచి పంపారు? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం రజనీకాంత్ మరియు ధనుష్ ఇళ్ల వద్ద భద్రతను మరింత కఠినతరం చేశారు.

Next Story