Bomb Threats: ఢిల్లీ తర్వాత.. బెంగళూరులో 40 స్కూళ్లకు బాంబు బెదిరింపుల కలకలం.. పోలీసులు అలర్ట్

by Ramesh Naini |

దేశంలో పలు రాష్ట్రాల్లోని ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తోంది.

Bomb Threats: ఢిల్లీ తర్వాత.. బెంగళూరులో 40 స్కూళ్లకు బాంబు బెదిరింపుల కలకలం.. పోలీసులు అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో పలు రాష్ట్రాల్లోని ప్రైవేటు స్కూళ్లకు (Bomb threat) బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీతో పాటు, బెంగళూరులో ఒక్కరోజే దాదాపు 80కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందులో భాగంగా బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్, కెంగేరితో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న 40 ప్రైవేటు పాఠశాలలకు గుర్తు తెలియని దుండగులు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు హుటాహుటిన విద్యార్థులను బయటకు పంపించి.. పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందిన వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీమ్ బెదిరింపు మెయిల్స్ వచ్చిన పాఠశాలల్లో తనిఖీలు చేపట్టింది. ‘బాంబ్స్ ఇన్‌సైడ్ ది స్కూల్’ ‘BOMBS INSIDE THE SCHOOL’ అనే లెటర్స్‌తో ఉన్న ఈ మెయిల్ రోడ్‌కిల్ [email protected] అనే ఐడి నుంచి అనేక స్కూళ్లకు పంపినట్లు తెలుస్తోంది.

ఇక ఢిల్లీలో ఇవాళ ఉదయం దాదాపు 45 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. పశ్చిమ విహార్, రోహిణి సెక్టార్-3 ప్రాంతంలోని మొదటి రెండు స్కూళ్లకు ఆగంతకుడు ఓ బాంబు బెదిరింపు లెటర్ పంపాడు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఆ లేఖను మీడియాకు వెల్లడించారు. దాదాపు 20 స్కూళ్ల తరగతి గదుల్లో పేలుడు పరికరాలను (ట్రైనైట్రోటోలుయిన్) ఉంచినట్లుగా లేఖలో ప్రస్తావించాడు. బాంబులు నల్లని ప్లాస్టిక్ బ్యాగులలో ఎవరి కంట్లో పడకుండా తెలిపాడు. బ్లాస్ట్ అయ్యాక ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరని ఆగంతకుడు పశ్చిమ విహార్, రోహిణి సెక్టార్-3 స్కూళ్లలో లెటర్ వదిలి వెళ్లాడు. దీంతో సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్, డాగ్ స్వాడ్, ఫైర్ సిబ్బంది ఆయా స్కూళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో గత 4 రోజులుగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. తనిఖీల్లో ఇప్పటి వరకు ఎలాంటి అనుమానించదగిన వస్తువులు లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ బెదిరింపు మెయిల్స్, లేఖలు పంపిందెవరని కనిపెట్టే పనిలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story