బంగారం కాదు.. నిజాయితీ గొప్పది! వైరల్ అవుతున్న మహిళా కండక్టర్ కథ

by Ramesh Naini |

ఈ రోజుల్లో నిజాయితీ ఎక్కడ ఉంది అనుకునేవారికి ఈ ఘటన ఒక కనువిప్పులాంటింది. పోయిందనుకున్న రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఓ బీఎంటీసీ (BMTC) కండక్టర్ నిజాయితీగా తిరిగి అప్పగించి, మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు.

బంగారం కాదు.. నిజాయితీ గొప్పది! వైరల్ అవుతున్న మహిళా కండక్టర్ కథ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజుల్లో నిజాయితీ ఎక్కడ ఉంది అనుకునేవారికి ఈ ఘటన ఒక కనువిప్పులాంటింది. పోయిందనుకున్న రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఓ బీఎంటీసీ (BMTC) కండక్టర్ నిజాయితీగా తిరిగి అప్పగించి, మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. గత శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఒక మహిళ కేఆర్ మార్కెట్ (KR Market) నుంచి బీఎంటీసీ బస్సు ఎక్కారు. ఆమె కనకపుర వైపు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, బస్సు మారే ఉద్దేశంతో బసవనగుడి వరకు టికెట్ తీసుకున్నారు. వారాంతం కావడంతో బస్సులో ప్రయాణికుల రద్దీ, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. బసవనగుడి రాగానే హడావిడిగా దిగే క్రమంలో, ఆమె తన సీటు పక్కన పెట్టిన బ్యాగును అక్కడే మరిచిపోయారు. బస్సు దిగిన కాసేపటికే బ్యాగు లేదన్న విషయం గుర్తించిన ఆమె, ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ బ్యాగులో దాదాపు రూ. 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. అప్పటికే బస్సు వెళ్లిపోవడంతో ఆమె ఆందోళన చెందారు.

పోలీసుల చొరవ.. సిబ్బంది అప్రమత్తత

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితురాలు బసవనగుడి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి బీఎంటీసీ సెంట్రల్ ఆఫీస్‌ను సంప్రదించారు. బస్సు నంబర్, రూట్ వివరాలను అందజేయడంతో అధికారులు సంబంధిత బస్సు డ్రైవర్, కండక్టర్‌లను అప్రమత్తం చేశారు. అధికారుల సమాచారంతో బస్సును నిలిపి తనిఖీ చేయగా, కండక్టర్ గంగా పూజారికి ఆ బ్యాగ్ దొరికింది. అందులో ఏముందో చూడకుండానే ఆమె అప్పటికే దాన్ని భద్రపరిచారు. అప్పటికి అందులో అంత విలువైన బంగారం ఉందని ఆమెకు తెలియదు. అనంతరం బాధితురాలిని పద్మనాభనగర్ డిపోకు పిలిపించారు. బీఎంటీసీ అధికారుల సమక్షంలో కండక్టర్ గంగా పూజారి ఆ బ్యాగును ఆమెకు సురక్షితంగా అందజేశారు. చేజారిపోయిందనుకున్న తన ఆస్తి తిరిగి దక్కడంతో ఆ మహిళ ఉద్వేగానికి లోనై, కన్నీటి పర్యంతమయ్యారు. రూ. 10 లక్షల విలువైన సంపద దొరికినా, ఏమాత్రం ఆశపడకుండా నిజాయితీగా వ్యవహరించిన కండక్టర్ గంగా పూజారి, డ్రైవర్ గోవర్ధన్‌లను బీఎంటీసీ ఉన్నతాధికారులు, ప్రజలు ప్రశంసించారు.

Next Story