Blue diamond: వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

by vinod kumar |
Blue diamond: వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశ చారిత్రక వారసత్వంతో ముడిపడి ఉన్న గోల్కోండ బ్లూ డైమండ్ (Golkonda blue diamond) వేలానికి సిద్ధంగా ఉంది. భారత రాచరికానికి గర్వకారణంగా ఉండి ఇండోర్, బరోడా మహారాజుల రాజ వైభవంలో భాగమైన ఈ వజ్రం మే 14న స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో జరిగే క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్‌లో అమ్మకానికి రానున్నట్టు తెలుస్తోంది. అత్యంత ప్రకాశవంతమైన ఈ నీలి వజ్రం 23.24 క్యారెట్ల బరువు ఉంటుంది. దీనిని ప్రసిద్ధ పారిస్ అభరణాల వ్యాపారి జార్ అందమైన వలయంలో అమర్చారు. ఈ వజ్రం విలువ 35 మిలియన్ డాలర్ల నుంచి 50 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 300 నుంచి 430 కోట్ల ధర పలికే అవకాశం ఉంది. చరిత్ర, రాజ వారసత్వంతో ముడిపడి ఉన్న ఇలాంటి అరుదైన రత్నం చాలా అరుదుగా వెలుగులోకి వస్తుందని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా తెలిపారు.

కాగా, ఈ అరుదైన వజ్రం తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ గోల్కొండ గనుల నుంచి ఉద్భవించింది. కాబట్టి దీనికి గోల్కోండ బ్లూ డైమండ్ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. గోల్కొండ గనులు చారిత్రాత్మకంగా ప్రపంచంలోని అత్యుత్తమమైన, అత్యంత విలువైన వజ్రాలను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందాయి. ఈ వజ్రం1920, 1930 లలో ఇండోర్ మహారాజా యశ్వంతరావు హోల్కర్ II ఆధీనంలో ఉంది. అనంతరం స్వాతంత్ర్యానికి ముందు ఈ వజ్రాన్ని ప్రసిద్ధ న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్ స్టన్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత మళ్లీ బరోడా మహారాజు వద్దకు చేరుకోగా, అనంతరం ప్రయివేట్ సంస్థ వద్దకు చేరుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది.

Next Story

Most Viewed