హార్ముజ్ జలసంధి దిగ్బంధం.. ప్రపంచానికి ఇంటర్నెట్ ముప్పు!

by Kema Shiva Kumar |

హార్ముజ్ జలసంధి దిగ్బంధంతో చమురు ధరలు ఇప్పటికే 126 డాలర్లు దాటగా, ఎర్ర సముద్రంలో అండర్ సీ కేబుల్స్‌పై హౌతీల దాడులతో అంతర్జాతీయ ఇంటర్నెట్ సేవలకు ముప్పు ఏర్పడింది.

హార్ముజ్ జలసంధి దిగ్బంధం.. ప్రపంచానికి ఇంటర్నెట్ ముప్పు!
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య యుద్ధం మూడో వారానికి చేరుకోవడంతో ప్రపంచం భారీ సంక్షోభం అంచున నిలిచింది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz), ఎర్ర సముద్రం (Red Sea) ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం చమురు సరఫరానే కాకుండా, అంతర్జాతీయ ఇంటర్నెట్ వ్యవస్థను కూడా ప్రమాదంలోకి నెట్టాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో 20శాతం వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ పాక్షికంగా దిగ్బంధించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర రికార్డు స్థాయిలో 126 డాలర్లకు చేరుకుంది. గల్ఫ్ దేశాల నుంచి ఆసియా, యూరప్ దేశాలకు వెళ్లే ట్యాంకర్లు నిలిచిపోయాయి. భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద ఆర్థిక భారంగా మారనుంది.

అండర్ సీ కేబుల్స్‌పై దాడులకు హౌతీల ప్లాన్..

ఎర్ర సముద్రం అడుగున ఉన్న అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్‌ (Undersea Cables) లక్ష్యంగా యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ దాడులు చేసే అవకాశం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఆసియా, యూరప్‌లను కలిపే ప్రధాన డేటా కేబుల్స్ దెబ్బతింటే, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇంటర్నెట్ అంతరాయం కలిగితే అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్లు కుప్పకూలే అవకాశం ఉంది.

ప్రపంచ దేశాల ఆందోళన..

యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లోకి కేబుల్ మరమ్మతు నౌకలు వెళ్లడం అసాధ్యంగా మారింది. ఒకవేళ ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అయితే, వాటిని పునరుద్ధరించడానికి నెలల సమయం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన, డిజిటల్ కనెక్టివిటీ రెండూ ఒకేసారి దెబ్బతినడం ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.

Next Story