పేద ముస్లింలకు బీజేపీ శుభవార్త

by Ajay Maddhiboyina |

నిజాముద్దీన్‌లో 'సౌగత్-ఏ-మోడీ' కిట్ల పంపిణీ సందర్భంగా జమాల్ సిద్దిఖీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ తాను 140 కోట్ల భారతీయులకు సంరక్షకుడినని చెబుతుంటారు.

పేద ముస్లింలకు బీజేపీ శుభవార్త
X

- రంజాన్ సందర్భంగా 'సౌగత్-ఏ-మోడీ' కిట్ల పంపిణీ

- దేశవ్యాప్తంగా 32 లక్షల మందికి లబ్ది

- కిట్లలో బట్టలతో పాటు డ్రైఫ్రూట్స్, సేమియా

- ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ప్రారంభం

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రంజాన్ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 32 లక్షల మంది ముస్లిం కుటుంబాలకు 'సౌగత్-ఏ-మోడీ' పేరుతో కిట్లను పంపిణీ చేయనుంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో బీజేపీ మైనార్టీ మోచ్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దిఖీ ప్రారంభించారు. ఆర్థికంగా బలహీనంగా ఉండే ముస్లిం కుటుంబాల కోసం ఈద్ సందర్భంగా ఈ 'సౌగత్-ఏ-మోడీ' కిట్లను పంపిణీ చేస్తోంది. ఈద్‌తో పాటు గుడ్ ఫ్రైడే, నౌరూజ్‌లను కూడా చేర్చాలని బీజేపీ భావిస్తోంది. ఈ కిట్లలో ఆహార పదార్థాలతో పాటు బట్టలు, సేమియా, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, చక్కెర వంటివి ఉన్నాయి. మహిళల సూట్లకు, పురుషుల కుర్తా-పైజామాలకు ఫ్యాబ్రిక్‌ను కూడా ఈ కిట్‌లలో అందిస్తున్నారు. ఈ కిట్ విలువ రూ.500 నుంచి రూ.600 వరకు ఉంటుందని తెలిసింది.

నిజాముద్దీన్‌లో 'సౌగత్-ఏ-మోడీ' కిట్ల పంపిణీ సందర్భంగా జమాల్ సిద్దిఖీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ తాను 140 కోట్ల భారతీయులకు సంరక్షకుడినని చెబుతుంటారు. ఆయన అన్ని పండుగల్లో పాల్గొంటారని అన్నారు. క్రిస్మస్, ఈస్టర్, వైశాఖీ పండగల్లో పాల్గొన్నారని.. నిజాముద్దీన్, అజ్మీర్ షరీఫ్‌ దర్గాలలో సమర్పించడానికి 'చాదర్'లు కూడా పంపుతారని గుర్తు చేశారు. మోడీ స్పూర్తితోనే ఇవ్వాళ ముస్లింలకు ఆహారంతో కూడిన కిట్లను ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. 32 వేల మంది మైనార్టీ మోర్చా కార్యకర్తలు దేశవ్యాప్తంగా 32 వేల మసీదులను సంప్రదించి ఈ కిట్లను అందిస్తారని సిద్దిఖీ తెలిపారు. ఈ కార్యక్రమం ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైందని అన్నారు. ప్రతీ కార్యకర్త కనీసం 100 మందికి 'సౌగత్-ఏ-మోడీ' కిట్లను అందించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

కాగా, కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో బీజేపీ 'సౌగత్-ఏ-మోడీ' కిట్లను పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Next Story