అది బీజేపీ ప్రమాదకర ఎజెండా.. రాష్ట్రాల హక్కులకు భంగం: చిదంబరం

by Disha Web Desk 13 |
అది బీజేపీ ప్రమాదకర ఎజెండా.. రాష్ట్రాల హక్కులకు భంగం: చిదంబరం
X

న్యూఢిల్లీ: ‘ఒకే దేశం.. అధికార కేంద్రీకరణ’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర అజెండాతో ముందుకెళ్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆరోపించారు. ‘ఫెడరలిజం’ అంశంపై ఇండియా టుడే నిర్వహించిన కాన్ క్లేవ్ సౌత్-2023లో ఆయన మాట్లాడుతూ.. అధికార కేంద్రీకరణలో భాగమే ఢిల్లీ ఉన్నతాధికారుల ఆర్డినెన్స్ అని.. కేంద్రం ఆధిపత్య ధోరణితో రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతుందని.. ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య చిచ్చుకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశ రాజ్యాంగంలోని ‘ఫెడరలిజం’ ప్రకారం కేంద్రంతో రాష్ట్రాలు దాదాపు సమాన భాగస్వామ్యం కలిగి ఉండాలని, బీజేపీ అజెండా దానికి పూర్తి విరుద్ధంగా రాష్ట్రాలపై కేంద్రం గుత్తాధిపత్యమే అని విమర్శించారు.

‘ఒకే ఓటరు జాబితా, ఒకే రేషన్ కార్డు, ఒకే భాష, ఒకే సిలబస్, ఒకే చరిత్ర, ఒకే సంస్కృతి’ అంటూ.. బీజేపీ చేస్తున్న ప్రచారం వెనుక నియంతృత్వ కుట్ర దాగి ఉందన్నారు. వేర్వేరు భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న దక్షిణ భారత దేశానికి బీజేపీ చర్యలు తీవ్ర నష్టం కలిగిస్తాయని, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రాలు తిరుగుబాటు చేయాలని సూచించారు. విద్య, సహకార రంగాలతో పాటు రాష్ట్రాలకు చెందిన అన్ని హక్కులను కేంద్రం క్రమంగా కైవసం చేసుకునే దిశగా ఎత్తుగడలు వేస్తోందని, రాష్ట్రాలు ఇప్పుడు వ్యతిరేకించకుంటే మున్ముందు కష్టాలు తప్పవని హెచ్చరించారు. మోడీ సర్కారు కుట్రకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ‘మూగ సాక్షులు’గా మిగిలారని ఎద్దేవా చేశారు.

సీబీఐ, ఈడీ బాధితుల్లో 90% మంది విపక్ష నాయకులే..

సీబీఐ, ఈడీ దాడులు ఎదుర్కొంటున్న నాయకుల్లో 90% మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే ఉండటాన్ని బట్టి బీజేపీ అణచివేత ధోరణి కనిపిస్తోందని చిదంబరం ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున్నప్పటికీ బీజేపీ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మోడీ సర్కారు పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం మోడీ సర్కారు అహంకారపూరిత చర్యకు పరాకాష్టగా అభివర్ణించారు. రూ.2 వేల నోట్లను ప్రవేశ పెట్టడం మూర్ఖపు నిర్ణయమని ఆనాడే చెప్పామని, ఇప్పుడు ఉపసంహరించుకోవడం మోడీ సర్కారు తన తప్పును సరిదిద్దుకోవడమేనని పేర్కొన్నారు. పీఎం పదవిపై ఈరోజు మోడీ ఉన్నారని, మరుసటి రోజు మరొకరు ఉంటారని.. పదవి శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు..

Also Read..

ఆయనను జూన్ 9లోగా అరెస్ట్ చేయాలి.. కేంద్రానికి రైతు సంఘాల నేతల అల్టిమేటం


Next Story

Most Viewed