కుంభమేళా హాజరుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాగ్వివాదం

by Ajay Maddhiboyina |

కాంగ్రెస్, రాహుల్ గాంధీ రామ మందిర నిర్మాణాన్ని మొదటి నుంచి వ్యతిరేకించారని ఆరోపించింది.

కుంభమేళా హాజరుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాగ్వివాదం
X

- గాంధీ కుటుంబం హిందూ వ్యతిరేకులు

- రాహుల్ ప్రయాగ్‌రాజ్‌కు ఏనాడూ రాలేదు

- విమర్శలు గుప్పించిన బీజేపీ

- సగం మంది కేంద్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు

- ఘాటుగా రిప్లయ్ ఇచ్చిన కాంగ్రెస్

దిశ, నేషనల్ బ్యూరో: యూపీ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుంభమేళాపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. కుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించలేదంటూ గాంధీ ఫ్యామిలీపై బీజేపీ విమర్శలు చేయగా.. కాంగ్రెస్ వాటిని ధీటుగా తిప్పికొట్టింది. కాంగ్రెస్ ఒక హిందూ వ్యతిరేక పార్టీ అని.. కుంభమేళాలకు గానీ, అయోధ్య రామమందిరం ప్రతిష్టకు కానీ రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే వెళ్లలేదని ఇది హిందూ మతంపై వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరని బీజేపీ ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని సోమ్‌నాథ్ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కుటుంబం మొత్తం హిందీ వ్యతిరేకులని ఆరోపించారు. బాబర్ కట్టిన బాబ్రీ మసీదుకు ఆ కుటుంబం మూడు సార్లు వెళ్లింది. కానీ రాముడి దర్శనం కోసం రామ మందిరానికి మాత్రం రాలేదని అన్నారు. రాహుల్ గాంధీ తన పార్లమెంట్ నియోజకవర్గమైన రాయ్‌బరేలికి తరచుగా వెళ్తుంటారు. కానీ అక్కడికి కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాకు మాత్రం రాలేదని అన్నారు.

ఇక బీజేపీ తమ ఎక్స్ ఖాతాలో కూడా రాహుల్‌పై విమర్శలు గుప్పించింది. శతాబ్దాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకున్నాము. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ మందిర ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్నారు. కానీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ రామ మందిర నిర్మాణాన్ని మొదటి నుంచి వ్యతిరేకించారని ఆరోపించింది. రాహుల్ గాంధీకి ఆహ్వానం పంపినా హాజరు కాలేదని బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ ఎలా హిందువుల మనోభావాలను గాయపరుస్తూ, తమ ఓటు బ్యాంకును బుజ్జగిస్తూ ఉంటుందని బీజేపీ పేర్కొంది. కాగా.. బీజేపీ విమర్శలను మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే తిప్పి కొట్టారు. బీజేపీ చెప్పిన లాజిక్ ప్రకారం తమ భాగస్వాములైన బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, హెచ్‌డీ కుమార స్వామి కూడా హిందు వ్యతిరేకులే అని అన్నారు. ఎందుకంటే వాళ్లు కూడా కుంభమేళాలో పాల్గొనలేదని ప్రియాంక్ ఖర్గే చెప్పారు. కేంద్ర మంత్రుల్లో సగం మంది, దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేల్లో సగం మంది, బీజేపీ ఐటీ సెల్ వారియర్లలో చాలా మంది కుంభమేళాకు రాలేదు. మరి వారందరూ హిందూ వ్యతిరేకులేనా అని ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించారు.

Next Story