- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: మార్చిలోనే బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఉన్న నాయకులు వీరే?
బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కొద్ది రోజులుగా పార్టీ అధిష్టానం సమాలోచనలు జరుపుతున్న విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కొద్ది రోజులుగా పార్టీ అధిష్టానం సమాలోచనలు జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పార్టీ చీఫ్ నడ్డా (Nadda) వారసుడిని నియమించేందుకు పలువురి పేర్లను పరిశీలిస్తున్నప్పటికీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీ సంప్రదాయం ప్రకారం రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన తర్వాత జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఈ ప్రక్రియ ఈ ఏడాది జనవరిలోనే పూర్తి కావాల్సి ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, అనేక రాష్ట్రాల్లో నూతన అధ్యక్షుల ఎంపిక ఆలస్యం కావడం వల్ల వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియపై బీజేపీ వేగం పెంచిందని మార్చిలోనే నూతన అధ్యక్షుడిని ప్రకటించే చాన్స్ ఉందని తెలుస్తోంది. నూతన ప్రెసిడెంట్ ఎన్నికకు చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే పేరును ఖరారు చేసే చాన్స్ ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
పార్టీ ప్రెసిడెంట్‌ను ఎన్నుకునేది ఇలానే?
బీజేపీ రాజ్యాంగం ప్రకారం.. కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు కనీసం 50 శాతం రాష్ట్ర యూనిట్లు తమ అధ్యక్షులను ఎన్నుకోవాలి. అనంతరం రాష్ట్ర అధ్యక్షులతో పాటు, జాతీయ అధ్యక్షుడి కోసం ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను కూడా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు పూర్తయ్యాయి. అలాగే ఇంకా ఆరు రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రక్రియను బీజేపీ అధిష్టానం వేగవంతం చేస్తున్నట్టు తెలుస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా వంటి ప్రధాన రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు వచ్చే వారం రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే అధ్యక్షుడి ప్రకటన ఉండనున్నట్టు సమాచారం
పలుమార్లు నడ్డా పదవీ కాలం పొడిగింపు
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పదవీ కాలం ఇప్పటికే పలుమార్లు పొడిగించారు. నడ్డా మొదటగా 2019 జూన్ 17న తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2020 జనవరి 20న ఆయన అధికారికంగా పార్టీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన పదవిలోనే కొనసాగుతున్నారు. పదవీ కాలం ముగిసినప్పటికీ పలుమార్లు పొడిగించారు. నడ్డా నాయకత్వంలో బీజేపీ16 రాష్ట్రాల్లో గెలుపొందింది. అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం నడ్డా కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. అయితే పార్టీ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలి. దీంతో కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.
రేసులో ఉన్నది వీరే?
బీజేపీ కొత్త చీఫ్ ఎంపికలో ప్రధానంగా పలువురి పేర్లు వినపడుతున్నాయి. అందులో ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivaraj singh chowhan), కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (manohar lal kattar), కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Darmendra pradaan), బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలకూ పార్టీ అధ్యక్ష పదవి వరించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దక్షిణాదిలో ఉన్న బీజేపీ నేతల్లో ప్రధానంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan reddy), కర్నాటకకు చెందిన సీనియర్ నేత బీఎల్ సంతోష్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దగ్గుబాటి పురందేశ్వరిల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీరితో పాటు బీజేపీ అనూహ్యంగా కొత్త పేరును వెలుగులోకి తెచ్చే అవకాశాలూ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






