- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు..బిహార్ ఎన్నికల ముందే ప్రకటన!
బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించబోతున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో జేపీ నడ్డా ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ భావిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించబోతున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో జేపీ నడ్డా ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ భావిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించబోతుందట. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం ఓ జాబితాను కూడా పార్టీ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక తరవాత జాతీయ అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అభ్యర్థిని ఎంపిక చేసిన తరవాత మంచి ముహూర్తం ఫిక్స్ చేసి కాషాయ పార్టీ అధ్యక్షుడిని ప్రకటించనున్నారని సమాచారం. జాతీయ అధ్యక్షుడిని ఖరారు చేసే ముందు గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లాంటి బీజేపీకి కీలకమైన రాష్ట్రాలలో కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా కుల, ప్రాంతీయ లేదా సామాజిక సమీకరణాల ఆధారంగా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పార్టీ భావించడంలేదని సమాచారం. పార్టీని మరింత బలోపేతం చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తినే అధ్యక్షుడిగా చేయాలని భావిస్తున్నారట. కొత్త వ్యక్తి కాకుండా ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఓ నేతను అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ ఆలోచిస్తోందని సైతం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కాషాయ పార్టీని నడిపే దళపతి ఎవరవుతారో అన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో నెలకొంది.






