Tamil Nadu BJP : తమిళనాడు బీజేపీకి షాక్..ఎన్ఈపీకి వ్యతిరేకంగా బీజేపీ నేత రాజీనామా!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-25 12:47:47  IST  )

జాతీయ విద్యావిధానం - 2020 (NEP-2020) ప్రకారం రాష్ట్రాలు తప్పనిసరిగా త్రిభాషా (హిందీ, ఇంగ్లీష్‌, ప్రాంతీయ భాష) సూత్రాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీచేయడం.. ఆ ఆదేశాలను తమిళనాడు (Tamil Nadu) సర్కారు తిరస్కరించడం రాష్ట్రంలో హిందీ వ్యతిరేక నిరసనలకు ఆజ్యం పోస్తుంది.

Tamil Nadu BJP : తమిళనాడు బీజేపీకి షాక్..ఎన్ఈపీకి వ్యతిరేకంగా బీజేపీ నేత రాజీనామా!
X

దిశ, వెబ్ డెస్క్ : జాతీయ విద్యావిధానం - 2020 (NEP-2020) ప్రకారం రాష్ట్రాలు తప్పనిసరిగా త్రిభాషా (హిందీ, ఇంగ్లీష్‌, ప్రాంతీయ భాష) సూత్రాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీచేయడం.. ఆ ఆదేశాలను తమిళనాడు(Tamil Nadu) సర్కారు తిరస్కరించడం రాష్ట్రంలో హిందీ వ్యతిరేక నిరసనలకు ఆజ్యం పోస్తుంది. ఎన్ఈపీ అమలు చేయకపోతే సమగ్ర శిక్ష పథకం కింద తమిళనాడుకు ఇవ్వాల్సిన రూ. 2,152 కోట్ల నిధులను విడుదల చేయబోమని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. త్రిభాషా సూత్రంపై తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వార్‌ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన నటి, బీజేపీ నాయకురాలు(BJP Leader) రంజనా నచియార్‌ (Ranjana Nachiyaar ) ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమిళనాడులో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని బలవంతపెట్టడం తప్పుడు విధానమని, తమిళ భాష ప్రభను తగ్గించే ఆ సూత్రానికి తాను వ్యతిరేకమని ఆమె చెప్పారు. ఈ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ తాను బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రంజనా నచియార్‌ నిర్ణయం తమిళనాట బీజేపీకి ఇబ్బందికరంగా తయారైంది.

జాతీయ విద్యావిధానం 2020 ప్రకారం పాఠశాలల్లో ఇంగ్లీష్‌, ప్రాంతీయ భాషతోపాటు హిందీ లాంగ్వేజ్‌ను కూడా తప్పనిసరి చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే హిందీ భాషను ప్రవేశపెట్టేందుకు తమిళనాడు సర్కారు నిరాకరిస్తుంది. త్రిభాషా విధానం భవిష్యత్తులో తమిళభాషను మరుగున పడేస్తుందని అధికార డీఎంకే ప్రభుత్వం వాదిస్తోంది. హిందీ కారణంగానే ఉత్తరాదిలో ప్రాంతీయ భాషల పరిధి తగ్గిందని ఆరోపిస్తుంది. అయితే తమిళ సర్కారు వాదనను కేంద్ర ఖండిస్తోంది.

విద్యావిధానంపై రాజకీయాలు చేయవద్ధంటూ హితవు పలుకుతోంది. విద్యార్థులకు అదనంగా మరో భాషను నేర్పడంవల్ల నష్టం ఏముంటుందని ప్రశ్నిస్తోంది. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రాలకు విద్యానిధులు అందజేయబోమని కేంద్రం చెబుతునే తాము ఏ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయడం లేదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ కూడా వివరణ ఇచ్చారు.

Next Story