Delhi Election Results: ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా.. ఆప్ కు కలిసిరాని జైల్ సెంటిమెంట్

by Prasad Jukanti |

ఢిల్లీ గడ్డపై బీజేపీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

Delhi Election Results: ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా.. ఆప్ కు కలిసిరాని జైల్ సెంటిమెంట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Delhi Assembly Election Results) వెలువడుతున్నాయి. దేశరాజధానిలో నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తాజా రాజకీయాల్లో సంచలనంగా మారుదామని ఆశించిన ఆమ్ ఆద్మీ (Aam Aadmi) పార్టీకి ఢిల్లీ ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. 26 ఏళ్ల నుంచి హస్తిన పాలనా పగ్గాలు దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ (BJP) కి ప్రజలు పట్టం కడుతూ తీర్పు ఇచ్చారు. ఈ నెల 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో సాధారణ, తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్, యూపీ మిల్కిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. వీటికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం 8 గంటలకు మొదలైంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఢిల్లీలో కౌంటింగ్ ప్రారంభం నుంచే కమలం పార్టీ తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ అవసరమైన మ్యాజిగ్ ఫిగర్ 36 స్థానాలను దాటింది. ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంట సమయానికి ఎన్నికల సంఘం వెబ్ సైట్ వివరాల ప్రకారం బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించి మరో 44 స్థానాల్లో ముందంజలో ఉండగా ఆమ్ ఆద్మీ 3 స్థానాల్లో విజయం సాధించి 19 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. ఇక దేశరాజధానిలో కాంగ్రెస్ (Congress) కనీసం ఖాతా కూడా తెరవలేదు. రెండున్నర దశాబ్ధాల తర్వాత దేశరాజధాని గడ్డపై అధికారం దక్కించుకోబోతున్నందున బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో సంబరాలు జరగనున్నాయి. ఈ సంబరాలకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. కాగా, ఈరోడ్ ఈస్ట్‌లో డీఎంకే అభ్యర్థి, మిల్కిపూర్‌లో బీజేపీ అభ్యర్థి లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

అప్ అగ్రనేతలను మట్టికరిపించిన కమలం నేతలు

ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో ఆమ్ ఆద్మీ కంచుకోటలను బీజేపీ అభ్యర్థులు బద్దలు కొట్టారు. ఫలితాల్లో ఆప్ అగ్రనేతలకు ఓటమి తప్పలేదు. మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ (Kejriwal), మనీశ్ సిసోడియా (Manish Sisodia), సత్యేంద్ర జైన్ (Satyendra Jain) ఓటమి పాలయ్యారు. ఇక కల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిశీ (Atishi) స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. గ్రేటర్ కైలాశ్‌లో ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ వెనుకంజలో ఉన్నారు. మాలవీయనగర్ ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి వెనుకంజలో ఉన్నారు. బద్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ తొలి రౌండ్లలో ఆధిక్యం కనిపించినా ఆ తర్వాతి రౌండ్లలో వెనుకబడిపోయారు.

ఓట్ షేర్‌లో హోరాహోరీ

ఓట్ షేరింగ్‌లో బీజేపీ- ఆప్ మధ్య హోరాహోరీ పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి 46.93 శాతం ఓటింగ్ నమోదు కాగా ఆమ్ ఆద్మీ పార్టీకి 43.23 శాతం వరకు ఓటింగ్ నమోదైంది. ఆప్, బీజేపీ మధ్య 2 శాతం మాత్రమే ఓట్ షేర్‌లో తేడా కనిపిస్తోంది. కాంగ్రెస్ 6.43 ఓట్ షేర్ సాధించుకుంది.

అధికార దాహంతనే ఆప్ ఓటమి : అన్నా హజారే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న కేజ్రీవాల్‌పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయని, ముఖ్యంగా లిక్కర్‌ స్కామ్‌‌తో ఆప్ ప్రభుత్వంతో పాటు కేజ్రీవాల్ బద్నాం అయ్యారని మండిపడ్డారు. అందుకే ఢిల్లీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టారని అన్నారు.

జైలుకు వెళ్లొచ్చిన ఆప్ నేతల ఓటమి

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలుకు వెళ్లొచ్చిన ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఓం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యారు. ఈ ముగ్గురు పోటీ చేసిన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు.

సీఎం రేసులో పర్వేశ్ సాహిబ్ సింగ్?

ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుండడంతో ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ సాహిబ్ సింగ్ (parvesh Sahib Singh) పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ క్రమంలో ఆయన అమిత్ షాతో భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేసులో మనోజ్ తివారీ, విజేందర్ గుప్తా, వీరేంద్ర సచ్‌దేవా పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.

Next Story