'బీజేపీ-ఈసీ చోర్ బజార్'.. బెగాల్ ప్రభుత్వ నిర్ణయంపై రాహుల్ ఆరోపణలు

by Prasad Jukanti |

బెంగాల్ సీఎస్ నియామకంపై రాజకీయ రచ్చ మొదలైంది. మనోజ్ అగర్వాల్ ను సీఎస్ గా నియమించడంపై టీఎంసీ ఇప్పటికే విమర్శలగు గుప్పించగా తాజాగా రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.

బీజేపీ-ఈసీ చోర్ బజార్.. బెగాల్ ప్రభుత్వ నిర్ణయంపై రాహుల్ ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. కొత్తగా కొలువు దీరిన సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పని చేసిన మనోజ్ అగర్వాల్ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడం రాజకీయంగా రచ్చకు కారణం అవుతోంది. ఈ నియామకంపై ఇప్పటికే టీఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ చర్యను 'బీజేపీ-ఈసీ చోర్ బజార్' గా అభివర్ణించారు. ఎక్స్ వేదికగా పోస్టును షేర్ చేస్తూ ఎన్నికల సంఘానికి, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని దొంగతనం ఎంత పెద్దదైతే ప్రతిఫలం అంత పెద్దదిగా ఉంటుందన్నారు.

టీఎంసీ ఆగ్రహం:

ఈ నియామకంపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు. ఎన్నికల కమిషన్, బీజేపీ కలిసి బెంగాల్ ఎన్నికలను దొంగిలించారని ఇందుకు ఇదే నిదర్శనం అని అని మండిపడ్డారు. ఈ చర్యతో ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ఎవరైనా విశ్వసిస్తారా అని టీఎంకే నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాల విమర్శలను బీజేపీ తిప్పికొడుతోంది. గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అర్హత ఉన్న సీనియర్లను కాదని తనకు నచ్చిన వారికి పదవులు ఇచ్చి బ్యూరోక్రసినీ భ్రష్టు పట్టించారని దుయ్యబట్టింది. మనోజ్ అగర్వాల్ ను మెరిట్ ప్రాతిపదికననే నియమించినట్లు బీజేపీ స్పష్టం చేసింది.

Next Story