రోగితో వెళ్తున్న అంబులెన్స్‌కు అడ్డుపడి బైకర్ల స్టంట్లు.. బెంగళూరులో అమానుష ఘటన

by Ramesh Naini |

అత్యవసర చికిత్స కోసం రోగితో వెళ్తున్న అంబులెన్స్‌కు దారివ్వకుండా కొందరు యువకులు బైక్‌లపై స్టంట్లు చేస్తూ రెచ్చిపోయారు.

రోగితో వెళ్తున్న అంబులెన్స్‌కు అడ్డుపడి బైకర్ల స్టంట్లు.. బెంగళూరులో అమానుష ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: అత్యవసర చికిత్స కోసం రోగితో వెళ్తున్న అంబులెన్స్‌కు దారివ్వకుండా కొందరు యువకులు బైక్‌లపై స్టంట్లు చేస్తూ రెచ్చిపోయారు. జులై 4న తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో బెంగళూరులోని గోరగుంటెపాళ్య - యశ్వంత్‌పూర్ మార్గంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. వైరల్ వీడియో, జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. అంబులెన్స్ సైరన్ మోగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా సుమారు 5 నుంచి 6 మంది బైకర్లు వాహనానికి అడ్డుగా వెళ్తూ ప్రమాదకరంగా వీలింగ్ (స్టంట్లు) చేశారు. వారి అత్యుత్సాహం, ర్యాష్ డ్రైవింగ్ వల్ల అంబులెన్స్ వేగం తగ్గించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ‘ఎక్స్’ (ట్విట్టర్)లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు అడ్డుపడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన యశ్వంత్‌పూర్ ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని, వారిని పట్టుకుని నిర్లక్ష్యపు, ప్రమాదకరమైన డ్రైవింగ్ కింద కేసులు నమోదు చేస్తామని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

Next Story