కన్న కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి అరెస్ట్

by Taduka Kalyani |

కన్న కొడుకును దారుణంగా హత్య చేసి పరారైన కసాయి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కన్న కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి అరెస్ట్
X

దిశ,కల్లూరు : కన్న కొడుకును దారుణంగా హత్య చేసి పరారైన కసాయి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తుపల్లి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన కొత్తపల్లి సీతారాములు అలియాస్ జాన్ మార్క్ అలియాస్ రాయప్ప చెడు వ్యసనాలకు బానిసై గతంలో పలు నేరాలకు పాల్పడి పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడు. ఇటీవల వ్యసనాలకు డబ్బు అవసరం కావడంతో కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఇంటిని విక్రయించేందుకు ప్రయత్నించాడు. అయితే అతని భార్యతో పాటు కుమారుడు కిరణ్ కుమార్ దీనికి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. పలుమార్లు ఇంటిని ఖాళీ చేయాలని కుమారుడిని హెచ్చరించినా వినకపోవడంతో, కుమారుడిని తొలగిస్తేనే ఇల్లు అమ్ముకోవచ్చని భావించి హత్యకు పథకం రచించాడు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం కుమారుడిని కల్లూరులోని ఓ బెల్ట్ షాపుకు తీసుకెళ్లి మద్యం తాగించి ఇంటికి తీసుకొచ్చాడు. మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్న సమయంలో రోకలి బండతో తలపై బలంగా మోదాడు. అనంతరం కుమారుడు మృతి చెందాడని భావించి తన ఆటోలో అక్కడి నుంచి పరారయ్యాడు. గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు, విస్సన్నపేట ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండగా, నమ్మదగిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. సోమవారం ఉదయం ముగ్గు వెంకటాపురం గ్రామం సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి ఆటో, నేరానికి ఉపయోగించిన రోకలి బండ, కత్తిని మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం సత్తుపల్లి అదనపు జూనియర్ సివిల్ జడ్జి (AJFCM) కోర్టులో హాజరుపరచనున్నట్లు సత్తుపల్లి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్సై డి. హరిత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story