- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బికాజీ ఫుడ్స్ అధినేత శివ్ రతన్ కన్నుమూత.. 8వ తరగతి చదివి రూ.13 వేల కోట్ల సామ్రాజ్య స్థాపన!
ప్రముఖ స్నాక్స్, స్వీట్స్ బ్రాండ్ ‘బికాజీ ఫుడ్స్’ వ్యవస్థాపకుడు, చైర్మన్ శివ్ రతన్ అగర్వాల్ (75) గురువారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ స్నాక్స్, స్వీట్స్ బ్రాండ్ ‘బికాజీ ఫుడ్స్’ (Bikaji Foods) వ్యవస్థాపకుడు, చైర్మన్ శివ్ రతన్ అగర్వాల్ (75) గురువారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. కేవలం 8వ తరగతి వరకే చదివిన ఆయన, తన అద్భుతమైన వ్యాపార వ్యూహాలతో ఏకంగా రూ.13,000 కోట్ల మార్కెట్ విలువ గల సంస్థను నిర్మించారు. తన భార్య బైపాస్ సర్జరీ చికిత్స అనంతరం విశ్రాంతి కోసం ఆయన కుటుంబంతో సహా చెన్నైలోని ఒక హోటల్‌లో బస చేశారు. గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
సామాన్యుడి నుంచి గ్లోబల్ బ్రాండ్ వరకు:
హల్దీరామ్స్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు గంగాబిషన్ మనవడైన శివ్ రతన్, కుటుంబ వ్యాపారం నుంచి విడిపోయి సొంత మార్గాన్ని ఎంచుకున్నారు. 1986లో బికనీర్ చేరుకుని తన కుమారుడి పేరు మీద ‘శివ్‌దీప్ ప్రొడక్ట్స్’ పేరుతో స్నాక్స్ తయారీని ప్రారంభించారు. 1993లో బికనీర్ నగర సంస్థాపకుడు రావు బికా పేరు స్ఫూర్తితో తన బ్రాండ్‌ను ‘బికాజీ’గా మార్చారు. ప్రాంతీయ రుచులను (భుజియా, నమ్కీన్, స్వీట్స్) ఆధునిక పద్ధతులతో మేళవించి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. రాజస్థాన్‌కు పరిమితమైన వ్యాపారాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. ఆయన మృతి పట్ల రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘బికనీర్ భుజియాకు దేశవిదేశాల్లో గుర్తింపు తెచ్చిన ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ఎక్స్ (X) వేదికగా కొనియాడారు. శివ్ రతన్ అగర్వాల్ మరణాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసిన బికాజీ సంస్థ.. ఆయన మృతి తమకు తీరని లోటని పేర్కొంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా సంస్థను ముందుకు తీసుకెళ్తామని యాజమాన్యం, ఉద్యోగులు నివాళులు అర్పించారు.






