Bihar: బిహార్‌లో భారీ వర్షాలు..19 మంది మృతి

by B.Srinivas |

బిహార్‌లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్థంబించింది.

Bihar: బిహార్‌లో భారీ వర్షాలు..19 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌ (Bihar) లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తుండటంతో జనజీవనం స్థంబించింది. ఆకస్మికంగా సంభవించిన ఈ తుపాను వల్ల 48 గంట్లోనే పలు ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. బెగుసరాయ్‌లో, దర్భంగాలో ఐదుగురు, మధుబనిలో ముగ్గురు, సహర్సా, సమస్తిపూర్‌లలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. ఎక్కువ మంది పిడుగు పాటుకు గురై మరణించినట్టు అధికారులు తెలిపారు. అంతేగాక పలు చోట్ల భారీగా పంట నష్టం జరిగినట్టు తెలుస్తోంది. తాజా పరిస్థితులపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nithish kumar) స్పందించారు. ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పంట నష్టాన్ని అంచనా వేసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు తుపాను నేపథ్యంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 12 వరకు రాష్ట్రమంతా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలకు వెళ్లొద్దని తెలిపింది. దర్భంగా, సమస్తిపూర్, మధుబని, ముజఫర్‌పూర్, సీతామరి, శిభార్, తూర్పు చంపారన్‌లలో గోధుమ, మామిడి పంటలకు అపార నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.

Next Story