తమిళనాడు ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. పోటీ చేయకుండానే ఓ సీటు కోల్పోయిన TVK

by Kema Shiva Kumar |

తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి అసెంబ్లీ ఎన్నికల వేళ బిగ్ షాక్ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థుల నామినేషన్లను ఈసీ రిజెక్ట్ చేసింది.

తమిళనాడు ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. పోటీ చేయకుండానే ఓ సీటు కోల్పోయిన TVK
X

దిశ, వెబ్‌డెస్క్: పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తలపతి విజయ్ (Thapathy Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల పోరులో మొదటి అడుగులోనే సాంకేతిక కారణాలతో ఓ నియోజకవర్గంలో ఆ పార్టీ పోటీకి దూరమైంది. కీలకమైన ఎడప్పాడి నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం (EC) తిరస్కరించింది. వివరాల్లోకి వెళితే.. ఎడప్పాడి (Edappadi) నియోజకవర్గం నుంచి టీవీకే తరపున అరుణ్‌కుమార్‌ ప్రధాన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తింపు పొందని రాజకీయ పార్టీల అభ్యర్థులకు కనీసం 10 మంది ప్రతిపాదకుల (Proposers) సంతకాలు అవసరం. కానీ, అరుణ్‌కుమార్‌ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో కేవలం 8 మంది సంతకాలు మాత్రమే ఉండటంతో అధికారులు దానిని తిరస్కరించారు.

ప్రత్యామ్నాయ అభ్యర్థికి కూడా..

ప్రధాన అభ్యర్థి నామినేషన్ రద్దయితే ఇబ్బంది కలగకుండా నిత్య అనే వ్యక్తిని ప్రత్యామ్నాయ (Substitute) అభ్యర్థిగా పార్టీ బరిలోకి దింపింది. దురదృష్టవశాత్తూ ఆమె నామినేషన్‌లో కూడా కేవలం 7 సంతకాలు మాత్రమే ఉండటంతో, ఆ నామినేషన్‌ను కూడా ఈసీ రద్దు చేసింది. దీంతో ఎన్నికల ముందే టీవీకే ఒక స్థానాన్ని కోల్పోయినట్లయింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న సమయంలో ఇలాంటి చిన్నపాటి సాంకేతిక పొరపాట్ల వల్ల సీటు కోల్పోవడం విజయ్ అభిమానులను, పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే దీనికి కారణమని పలువురు చర్చించుకుంటున్నారు.

Next Story