మమతా బెనర్జీకి భారీ షాక్.. ఎన్డీయేకు మద్దతుగా 20 మంది టీఎంసీ ఎంపీల లేఖ

by Ramesh Naini |

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పార్లమెంటులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

మమతా బెనర్జీకి భారీ షాక్.. ఎన్డీయేకు మద్దతుగా 20 మంది టీఎంసీ ఎంపీల లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పార్లమెంటులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు తెలుపుతూ సుమారు 20 మంది టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ సంచలన విషయాన్ని ఆ పార్టీ ఎంపీ కకోలీ ఘోష్ దస్తిదార్ సోమవారం స్వయంగా వెల్లడించారు.

ఎన్డీయేతోనే భవిష్యత్తు..

బెంగాల్ ఎన్నికల తీర్పును తాము అంగీకరిస్తున్నామని, తమ రాజకీయ భవిష్యత్తు ఎన్డీయే విధానాలతోనే సరిపోలుతుందని కకోలీ ఘోష్ పేర్కొన్నారు. ‘ఇండియా’ కూటమి సమావేశం కోసం మమతా బెనర్జీ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఈ అసమ్మతి వెలుగుచూడటం గమనార్హం.

సుఖేందు శేఖర్ రాజీనామా

టీఎంసీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామాను చైర్మన్ ఆమోదించిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకోవడం పార్టీలో ముదిరిన సంక్షోభానికి అద్దం పడుతోంది. పార్టీలో సీనియర్లను విస్మరిస్తున్నారని రెబల్ నేత రితుబ్రత బెనర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఎలాంటి అనుభవం లేని జూనియర్లకు ముందు వరుస ఇచ్చి, సీనియర్లను చివరి వరుసలో కూర్చోబెట్టడం దారుణమని విమర్శించారు. రానున్న గంటల్లో టీఎంసీలో అసమ్మతి గళం వినిపించే ఎంపీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రెబల్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వరుస రాజీనామాలు, పెరుగుతున్న అసమ్మతితో టీఎంసీలో అంతర్గత సంక్షోభం తీవ్ర రూపం దాల్చినట్టు కన్పిస్తోంది.

Next Story