చండ్ర రాజేశ్వరరావు ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకం : మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి

by Naga Rani Yarlagadda |

దేశ రాజకీయ చరిత్రలో కీలక పాత్ర పోషించిన నాయకుడి అనుభవాలు సంపూర్ణంగా పుస్తకరూపంలో అందుబాటులోకి రాకపోవడం ఒక లోటుగా మిగిలిపోయిందని శ్రీనివాస్ రెడ్డి ఆవేదన చెందారు.

చండ్ర రాజేశ్వరరావు ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకం : మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో పెరుగుతున్న అసంతృప్తి, రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో నెలకొంటున్న నిరాశను అధిగమించాలంటే కమ్యూనిస్టు, సెక్యులర్‌, సోషలిస్టు శక్తులు ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తిని నేటి తరానికి చేరవేయడంతో పాటు యువతను ఆకర్షించే పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సూచించారు. అప్పుడే కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజం చండ్ర రాజేశ్వరరావు బాటలో పయనించిన వారమవుతామని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజం చండ్ర రాజేశ్వరరావు 112 వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సీఆర్‌. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘బొద్దింకల అవిర్భావం - యువత - నెటిజెన్స్ ఎటువైపు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సీఆర్‌ ఫౌండేషన్‌ గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ కె.నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారత వామపక్ష రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు చండ్ర రాజేశ్వరరావు వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం, ప్రజాసేవలో ఆదర్శప్రాయుడని తెలంగాణ కొనియాడారు. సీఆర్‌ కేవలం కమ్యూనిస్టు నాయకుడే కాకుండా రాజకీయ నైతికతకు, నిరాడంబర జీవనానికి ప్రతీకగా నిలిచారని అన్నారు.

దేశ రాజకీయ చరిత్రలో కీలక పాత్ర పోషించిన నాయకుడి అనుభవాలు సంపూర్ణంగా పుస్తకరూపంలో అందుబాటులోకి రాకపోవడం ఒక లోటుగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చండ్ర రాజేశ్వరరావు జయంతి సందర్భంగా బొద్దింకల ఆవిర్భావం- యువత- నెటిజన్స్‌ ఎటువైపు అనే అంశంపై శ్రీనివాస్‌రెడ్డి కీలకోపాన్యాసం చేశారు. ఓ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోచనతో లేక అనాలోచనాతోనో బొద్దింకలు అనే పదాన్ని ఉపయోగించిన నేపథ్యంలో దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా సోషల్‌ మీడియా వేదికగా కాక్రోచ్‌ జనతా పార్టీ ఏర్పాటు చేయడం, ఆ వెంటనే 2.20 కోట్ల మంది సభ్యులు దానికి మద్దతు పలకడం దేశ యువతలో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 6వ తేదీన కాక్రోచ్‌ జనత పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నీట్‌ పరీక్ష ప్రశ్నా పత్రం లీకేజీ, సీబీఎస్‌ఈ ఘటలపై యువత పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందేన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు వారు ప్రధానంగా 5 డిమాండ్లపై ప్రభుత్వ ముందు పెట్టారన్నారు. అందులో ఒక పార్టీ గుర్తుపై ఎన్నికై తర్వాత మరో పార్టీలో చేరే ప్రజా ప్రతినిధులను 20 ఏళ్ల పాటు పోటీకి అనర్హులు ప్రకటించాలని అదేవిధంగా ఈ దేశంలోని 18 ఏళ్ల నిండిన ప్రతి పౌరుడికి ఓటు కల్పించాలని దానిని ఎన్నికల కమిషన్‌ తొలగిస్తే కమిషనర్లపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసేలా ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు ఓటర్ల జాబితాల నిర్వహణలో పారదర్శకత పెంచాలని సూచించారన్నారు.

మీడియా సంస్థలు ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యతను మరవకూడదని, ప్రజల సమస్యలను ప్రతిబింబించే స్వతంత్ర మీడియాకు మాత్రమే అనుమతించాలని కార్పొరేట్‌ మీడియా సంస్థలను నిషేదించాలని డిమాండ్‌ చేశారన్నారు.ఈ నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతల నేపథ్యంలో కమ్యూనిస్టు, సెక్యులర్‌, సోషలిస్టు శక్తుల మనుగడ అత్యంత కీలకమన్నారు. యువతను ఆకర్షించడంలో కమ్యూనిస్టు పార్టీలు కొత్త వ్యూహాలను అవలంబించాల్సిన అవసరం ఉందని, 50 ఏళ్ల క్రితం పనిచేసిన పద్ధతులు నేటి తరానికి సరిపోవని, వారి భాషలోనే మాట్లాడుతూ ఆధునిక మాధ్యమాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగితేనే దేశ భవిష్యత్తుకు భరోసా ఉంటుందని పేర్కొన్నారు. డాక్టర్‌ కె. నారాయణ మాట్లాడుతూ దేశ సమైక్యతకు ఎనలేని కృషి చేసిన మహానేత చండ్ర రాజేశ్వరరావు అని కొనియడారు.దేశంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం తాత్కాలికం కాదని, యువతలో పెరుగుతున్న అసంతృప్తి, రాజ్యాంగబద్ధ సంస్థలపై నమ్మకం క్షీణించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలని హెచ్చరించారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటి దేశాల్లో కూడా ఇదే తరహా ప్రజా అసంతృప్తి కనిపించిందని వివరించారు. యువతలో పేరుకుపోతున్న అసంతృపిని ప్రభుత్వం అర్థం చేసుకుని పరిష్కరించకపోతే అది దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులను గణనీయంగా ప్రభావితం చేయగలదన్నారు. సీఆర్ ఫౌండేషన్‌ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు జీవితం ఉద్యమ కార్యకర్తలకు ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అని అన్నారు. సీఆర్‌ తన 80 ఏళ్ల జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేశారని గుర్తుచేశారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ త్యాగాలు తనపై ప్రభావం చూపాయని సీఆర్‌ చెప్పేవారని తెలిపారు. ప్రజాతంత్ర, వామపక్ష శక్తుల ఐక్యత ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని ఆయన విశ్వసించారని పేర్కొన్నారు. ఈసందర్భంగా గత25 ఏళ్లుగా సీఆర్‌ ఫౌండేషన్‌లో నివాసం ఉంటున్న ప్రొఫెసర్‌ వేణు గోపాల్‌, డాక్టర్‌ రంగనాయకి 70వ వివాహ వార్షికోత్సం సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యదర్శి పి.జె.చంద్రశేఖరరావు, కోశాధికారి సి.చెన్నకేశవరావు, సీఆర్‌ ఫౌండేషన్‌ డెయాగ్నస్టిక్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రంజని, మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్‌ కల్పనలు పాల్గొన్నారు.

Next Story