మున్సిపల్‌లో నంబర్ ప్లేట్లు లేని వాహనాల జోరు

by Batti.Sumithra |

కొల్లాపూర్ పట్టణంలో నంబర్ ప్లేట్లు లేని వాహనాల సంచారం రోజురోజుకూ పెరుగుతోంది.

మున్సిపల్‌లో నంబర్ ప్లేట్లు లేని వాహనాల జోరు
X

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ పట్టణంలో నంబర్ ప్లేట్లు లేని వాహనాల సంచారం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ఉండాలి. అయితే కొల్లాపూర్ మున్సిపల్ కార్యాలయానికి చెందిన వ్యర్థాల సేకరణ కోసం వినియోగిస్తున్న ట్రాక్టర్, జేసీబీ, టాటా ఏస్ వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండానే రోడ్ల పై విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఈ వాహనాలు ప్రతిరోజూ విధులు నిర్వహించి తిరిగి వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణంలో నిలిపివేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా మున్సిపల్ పరిధిలో ఉన్న ఒక ట్రాక్టర్ బాడీ పూర్తిగా తుప్పుపట్టి నిరుపయోగంగా మారినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో నంబర్ ప్లేట్లు లేకుండా నడిపే ద్విచక్ర వాహనాలను పోలీసులు ఆపి చలాన్లు విధిస్తుంటారు. అయితే మున్సిపల్‌లో చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న ట్రాక్టర్, టాటా ఏస్ వంటి వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండానే పోలీసుల కళ్లముందు నిబంధనలకు విరుద్ధంగా సంచరిస్తున్నప్పటికీ, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని పట్టణవాసులు విమర్శిస్తున్నారు.

కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో రిజిస్ట్రేషన్ నంబర్లు లేకుండా రోడ్లపై తిరుగుతున్న ఈ వాహనాల విషయంలో జిల్లా రవాణా శాఖ అధికారులు పర్యవేక్షణను పూర్తిగా గాలికి వదిలేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ చెత్త సేకరణకు వినియోగిస్తున్న ఈ వాహనాలు ప్రమాదాలకు గురైతే, వాటిని గుర్తించడం కూడా కష్టసాధ్యంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన వాహనాలే రిజిస్ట్రేషన్ నంబర్లు లేకుండా రోడ్లపై తిరుగుతున్నప్పటికీ జిల్లా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో, ఆ శాఖపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ కార్యాలయ పరిధిలో వినియోగిస్తున్న అన్ని వాహనాలకు తక్షణమే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసి, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కొల్లాపూర్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Next Story