BIG News: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గోల్డ్ స్మగ్లింగ్.. ఏకంగా 115 బిస్కెట్లు..!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-16 13:12:00  IST  )

BIG News: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గోల్డ్ స్మగ్లింగ్.. ఏకంగా 115 బిస్కెట్లు..!
X

దిశ, వెబ్‌‌‌‌డెస్క్ : ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో.. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని గుర్తించారు. మూడున్న కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ భారీ గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ ను ఛేదించింది. పక్కా సమాచారం రావడంతో.. రిస్క్ బేస్డ్ ప్రొఫైలింగ్ ఆధారంగా కస్టమ్స్ అధికారులు వ్యూహాత్మకంగా జరిపిన తనిఖీల్లో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన భారత సంతతికి చెందిన వ్యక్తి వద్ద భారీ మొత్తంలో బంగారు బిస్కెట్లను గుర్తించారు. నిందితుడు తన దుస్తుల్లో దాచి తరలిస్తున్న 115 గోల్డ్ బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు సుమారు మూడున్నర కిలోలు ఉంటుందని అంచనా వేశారు.

నిందితుడు మే 15వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ (AI -4174) ద్వారా ఢిల్లీకి చేరుకున్నాడు. ఇంటర్నేషనల్ అరైవల్ టెర్మనల్ లో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి.. ఎలాంటి తనిఖీలు లేని గ్రీన్ ఛానల్ ద్వారా తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఎయిర్ ఇంటెలిజెన్స్ టీమ్ అతన్ని ఆపింది. అనంతరం సదరు ప్రయాణికుడిని, అతని లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అసలు విషయం వెలుగుచూసింది. బంగారం స్మగ్లింగ్ కోసం నిందితుడు అత్యంత తెలివైన, వినూత్నమైన పద్ధతిని ఎంచుకున్నాడు. ఇందుకోసం అతను ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక బెల్ట్‌ను ధరించాడు. అంతేకాకుండా, తను వేసుకున్న ట్రాజర్ ప్యాంట్ లోపల సీక్రెట్ పాకెట్స్ కుట్టించి.. ఆ జేబుల్లోనే అత్యంత నాణ్యమైన 24 క్యారెట్ల (999.9 స్వచ్ఛత) కలిగిన 115 బంగారు బిస్కెట్లను దాచిపెట్టాడు. దీంతో కస్టమ్స్ అధికారులు ఆ అక్రమ బంగారాన్ని కస్టమ్స్ చట్టం-1962, సెక్షన్ 110 కింద జప్తు చేశారు. అమెరికా పౌరసత్వం కలిగిన నిందితుడిని సెక్షన్ 104 కింద అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.

Next Story