Unesco: భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

by Shamantha N |

భగవద్గీతకు, భారతముని రచించిన నాట్యశాస్త్రానికి అరుదైన గుర్తింపు లభించింది. భగవద్గీతతో పాటు నాట్య శాస్త్రానికి యునెస్కో మెమోరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు దక్కింది.

Unesco: భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: భగవద్గీతకు, భారతముని రచించిన నాట్యశాస్త్రానికి అరుదైన గుర్తింపు లభించింది. భగవద్గీతతో పాటు నాట్య శాస్త్రానికి యునెస్కో మెమోరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు దక్కింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రధాని నరేంద్రమోడీ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని అన్నారు. ఇది భారతీయ సంస్కృతి, తాత్విక వారసత్వానికి దక్కిన గుర్తింపుగా పేర్కొన్నారు. "ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం! యునెస్కో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో గీత, నాట్యశాస్త్రం చేర్చడం మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికత, చైతన్యాన్ని పెంపొందించాయి. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి" అని ప్రధాని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు.

గజేంద్ర షెకావత్ పోస్టు..

ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. "భారత నాగరికత వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం"గా షెకావత్ అభివర్ణించారు. ఈ ప్రపంచ గౌరవం భారత్ శాశ్వత జ్ఞానం, కళాత్మక ప్రతిభకు దక్కిన పురస్కారంగా పేర్కొన్నారు. ఈ కాలాతీత రచనలు సాహిత్య సంపద కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. ఇవి భారత్ ప్రపంచ దృష్టికోణాన్ని, భావ వ్యక్తీకరణ విధానాన్ని రూపొందించిన తాత్విక పునాదులు అని వెల్లడించారు. కాగా.. షెకావత్ పోస్టుని రీట్వీట్ చేస్తూ.. మోడీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Next Story