బెంగాల్‌ ‘సర్‌’ ప్రక్రియ.. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఆందోళన

by Ramesh Naini |

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ తీరుపై నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇంత "అనవసర హడావుడి" ఎందుకని ఆయన ప్రశ్నించారు.

బెంగాల్‌ ‘సర్‌’ ప్రక్రియ.. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ తీరుపై నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇంత "అనవసర హడావుడి" ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రక్రియ వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సర్ ప్రక్రియపై ఆయన తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ అనేది శాస్త్రీయంగా, తగినంత సమయం ఇచ్చి చేయాల్సిన ప్రక్రియ అని, కానీ బెంగాల్‌లో ప్రస్తుతం అది కనిపించడం లేదని సేన్ అభిప్రాయపడ్డారు. ఓటు హక్కును నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలను సమర్పించేందుకు సామాన్య ప్రజలకు తగినంత సమయం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.

పేదల పరిస్థితి ఏమిటి?

ఓటరుగా తనకు ఒక చేదు అనుభవం ఎదురైందని ఆయన వెల్లడించారు. అధికారుల వద్ద పాత రికార్డులు ఉన్నప్పటికీ, తన తల్లి పుట్టిన తేదీ, వయస్సు వంటి వివరాలపై తనను విచారించారని చెప్పారు. గ్రామీణ భారతంలో పుట్టిన తనలాంటి వారికి 'బర్త్ సర్టిఫికెట్లు' ఉండవని, తనకున్న పలుకుబడితో మిత్రుల సాయం తీసుకుని ప్రక్రియ పూర్తి చేసుకోగలిగానని తెలిపారు. ‘కానీ వెనుకబడిన వర్గాలు, పేదల పరిస్థితి ఏమిటి?’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈసారి కూడా ఓటు వేయడానికి సిద్ధం

ఈ సవరణ ప్రక్రియ వల్ల నిరుపేదలు, అణగారిన వర్గాలు మరియు మైనారిటీలు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని సేన్ హెచ్చరించారు. అవసరమైన పత్రాలను సేకరించడం వారికి భారంగా మారుతుందని, ఇది సమాజంలోని అట్టడుగు వర్గాలకు అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయనేది పక్కన పెడితే, ఏ ఒక్క అర్హుడైన పౌరుడు ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టుపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 92 ఏళ్ల వయసులో ఉన్న అమర్త్యసేన్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తన విధులను సమన్వయం చేసుకుంటూనే ఈసారి కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

Next Story